విశాఖ వేదికగా మోడీ కీలక ప్రకటన చేస్తారా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధాని అయ్యాక విశాఖపట్నం తొలిసారి వస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధాని అయ్యాక విశాఖపట్నం తొలిసారి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రధానికి విశాఖలో ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లను చేసింది.
గ్రాండ్ వెల్ కం మోడీకి దక్కబోతోంది. ఏకంగా గంట పాటు విశాఖ వీధులలో నరేంద్ర మోడీ రోడ్ షో చేయనున్నారు. ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు అంటే ఎక్కువగా ఆశగా ఎదురుచూస్తోంది ఉక్కు కర్మాగారం కార్మికులు ఉద్యోగులు. వారు ఏకంగా నాలుగేళ్ళ నుంచి నిరవధిక నిరసన కార్యక్రమాలలో ఉన్నారు.
ఎపుడైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు ఉపసంహరించుఇఉంటామని 2021 జనవరి నెలాఖరులో చెప్పిందో నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనా పధంలో ముందుకు సాగుతున్నారు. ఈ నాలుగేళ్ళలోనూ కేంద్రంలో మోడీయే ప్రధానిగా ఉన్నారు. ఏపీలో చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తల తరువాత మూడున్నరేళ్ళ పాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
అయితే జగన్ సీఎం అయినా చంద్రబాబు సీఎం అయినా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా స్టీల్ ప్లాంట్ కధ ఏమీ మారలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని అవసరం అనుకుంటే సెయిల్ లో విలీనం చేస్తామని కేంద్రం ఒక్క మాట చెప్పాలని ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అంతే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది పోరాడి ప్రాణ త్యాగాలుచ్ చేసి దక్కించుకున్నది కాబట్టి దానిని ఇలాగే కొనసాగించాలన్నది మొదటి డిమాండ్.
ఆ విధంగా చేయాలీ అంటే కనీసం పదిహేను వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ కి సొంత గనులను కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవలనే పొరుగున ఉన్న స్టేట్ కర్ణాటకలోని స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మరి ఆ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు చేయకూడదని అంటున్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన ప్రకటన నరేంద్ర మోడీ చేసి తీరాలని ఉక్కు కార్మిక సంఘాలతో పాటు వామపక్షాలు కాంగ్రెస్ నేతలు గట్టిగా కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెబుతున్నారు.
విశాఖ వస్తున్న ప్రధాని నగరం నడిబొడ్డున విశాఖ స్టీల్ ప్లాంట్ కి పూర్తిగా ఉపశమనం ఇచ్చేలా కీలక ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సభా వేదిక మీద నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని కోరాలని కూడా వారు అంటున్నారు.
మరి నరేంద్ర మోడీ ఏమి చెబుతారో చూడాలి. నరేంద్ర మోడీ ఎన్ని లక్షల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినా కానీ స్టీల్ ప్లాంట్ గురించి స్పష్టమైన ప్రకటన చేయకపోతే మాత్రం ఆయన విశాఖ టూర్ విఫలం అయినట్లే అని వామపక్షాల నేతలు అంటున్నారు. మరి ప్రధాని స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించేందుకు పవర్ ఫుల్ ప్రకటన చేస్తారా అంటే వేచి చూడాల్సి ఉంది.