జమిలిపై వెనక్కి తగ్గని మోడీ.. అమలు ఎప్పటి నుంచి అంటే..!

వాస్తవానికి ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తపించారు.

Update: 2024-09-16 07:32 GMT

వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌పై ప్రధాని మోడీ మరోసారి దృష్టి సారించారా..? ఆ దిశగా కసరత్తు ప్రారంభించారా..? జమిలి ఎన్నికలపై ఎన్డీయే కూటమి ఫోకస్ పెట్టిందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈ టర్మ్‌లోనే అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తపించారు. ఈ మేరకు అన్ని పార్టీలతో దాదాపుగా సమావేశాలు నిర్వహించారు. అందరి ఓపీనియన్లు సేకరించారు. అంతలోనే ఏం జరిగిందో కానీ ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఈఎన్నికల్లో అమల్లోకి తీసుకురాలేకపోయారు. తాజాగా.. మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరమీదకు వచ్చింది. అయితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇది తప్పకుండా అమల్లోకి వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చిలో వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీని సైతం నియమించారు. ఆ కమిటీ తొలి అడుగుగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించేందుకు స్టడీ చేశారు. వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సమకాలీకరించాలని సిఫారసు చేసింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ఎలాంటి కాలపరిమితిని చెప్పలేదు. ఈ కమిటీ త్వరలోనే కమిషన్‌కు సిఫారసు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అలాగే.. ఒకవేళ హంగ్ వచ్చినా.. లేదా అవిశ్వాస తీర్మానం వంటివి ఏర్పడినా ఏకీకృత ప్రభుత్వం కోసం ఓ ప్రత్యేక నిబంధనను సైతం ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు పూర్తయింది. ఈ ప్రభుత్వ హయాంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తామని ఓ బీజేపీ సీనియర్ నేత కూడా చెప్పారు. స్వాతంత్ర్యం దినోత్సవం వేళ కూడా ప్రధాని మోడీ ఇదే విషయంపై గళం వినిపించారు. తరచూ ఎన్నికల జరగడం దేశ పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయని, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చులు తగ్గడంతోపాటు సమయమూ కలిసొస్తుందని చెప్పుకొచ్చారు.

మోడీ నిర్ణయానికి జనతాదళ్ మద్దతు ఇస్తుండగా.. ఎన్టీయేలో మరో కీలక భాగస్వామ్యమైన టీడీపీ మాత్రం సాధ్యాసాధ్యాలపై ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీపై మాత్రం స్పందించలేదు. మిత్రపక్షాల నుంచే ఈ విధానానికి పెద్దగా మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 272 మార్క్ దగ్గరే నిలిచిపోయింది. దాంతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తీసుకోక తప్పలేదు. వీరి మద్దతుతోనే దేశంలో మోడీ మూడోసారి అధికారం చేపట్టారు.

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ సైతం జమిలి ఎన్నికల అంశాన్ని తన మేనిఫెస్టోలో పెట్టింది. అందుకే ఈ విధానాన్ని అమలు చేసే దిశగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నిపార్టీల నుంచి ఏకాభిప్రాయం సాధించి ఫ్యూచర్ ఎన్నికలు జమిలి పద్ధతిలో నిర్వహించాలని మోడీ భావిస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News