మోడీ ఎఫెక్ట్: బాబుకు ఆప్షన్ లేదు ..!
ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. నొప్పి తెలియకుండానే వాతలు పెడుతున్నారు. ఇవ్వాల్సిన సొమ్ములో కోతలు పెడుతున్నారు. ఇది ఇప్పుడే కాదు.. వైసీపీ హయాంలోనూ ఇలానే జరిగింది. కానీ, ఇప్పుడు నాటికి-నేటికి భిన్నమైన వాతావరణం ఉంది. అప్పట్లో బీజేపీ అధికారం పంచుకోలేదు. మంత్రి పీఠాలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు ఉన్నది ఎన్డీయే కూటమి సర్కారు. మంత్రి పదవిని కూడా తీసుకున్నారు.
దీంతో మునుపటికన్నా ఇప్పుడు మంచిజరుగుతుందని ప్రజలు భావించారు. డబుల్ ఇంజన్ సర్కారు దడదడలాడిస్తుందని.. సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా లెక్కలు వేసుకున్నారు. అయితే.. మోడీ తీరులో పెద్దగా మార్పులేదు. పైగా.. `అనుమానాలు` పెరుగుతున్నాయి. పోలవరానికి ఇచ్చిన అడ్వాన్సు నిధుల విషయంలో పెట్టిన షరుతులు దీనిని ప్రస్పుటం చేస్తున్నాయి. దీంతో కూటమి సర్కారులో లుకలుకలు వినిపిస్తున్నాయి.
ఇక, వరద సాయం 6880 కోట్ల రూపాయలు కావాలని కోరితే.. 1430 కోట్లు ఇచ్చిన మోడీ సర్కారు చేతులు దులుపుకొంది. ఇది మరింతగా గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సర్కారుకు మారిపోయింది. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ తాడు తెగదు.. పాము చావదు! అన్నట్టుగానే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారు.. చంద్రబాబుకు ట్రబుల్ ఇంజన్‌గా మారిపోయిందన్న భావన వ్యక్తమవుతోంది. అయితే.. అలాగని చంద్రబాబు మోడీని వదులుకునే పరిస్థితి లేదు.
ఎందుకంటే.. మోడీ వదులుకుంటే.. ఆ గ్యాప్.. ఆ వెంటనే ఫిల్ చేయడానికి వైసీపీ కాచుకుని కూర్చుంది. ఏ క్షణాన బాబు మోడీని వదిలేసినా.. (2018లో మాదిరిగా) ఆ క్షణమే వైసీపీ మోడీని కౌగిలించుకునేందుకు రెడీగా ఉందని.. జాతీయ మీడియానే కాదు.. బీజేపీలోని నాయకులు కూడా చెబుతున్నారు. దీంతో చంద్రబాబుకు ఇప్పుడు మోడీని వదులుకునే ఆప్షనే కాదు.. ఆయనను నొప్పించే ఆప్షన్ కూడా లేదు. ఆయన ఏం చేసినా.. అంతా బాగుందని చెప్పుకోవడం తప్ప.. రెండో మాటే చంద్రబాబు నుంచి వినిపించే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.