ఒకే వేదిక మీద మోడీ...బాబు...పవన్...!

ఒక అరుదైన దృశ్యం ఏపీ రాజకీయ తెర మీద ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపిస్తారు అని అంటున్నారు.

Update: 2024-03-10 03:33 GMT

ఎన్నాళ్ళకెన్నాళ్లకు అన్నట్లుగా ఒక అరుదైన దృశ్యం ఏపీ రాజకీయ తెర మీద ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపిస్తారు అని అంటున్నారు. ఈ నెల 17న టీడీపీ కూటమి ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించనుంది. చిలకలూరిపేటలో జరిగే సభలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ సభకు డేట్ ఎపుడో ఫిక్స్ అయింది. అపుడు సభలో జనసేన టీడీపీ అధినేతలే పాల్గొంటారు అని చెప్పారు. తాజాగా బీజేపీతో పొత్తు కుదిరిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సభలో పాలుపంచుకుంటారు అని అంటున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చెప్పారని సమాచారం.

అంటే మరో వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ ఏపీకి వస్తున్నారు అన్న మాట. ఆయన ఏపీలో కూటమితో కలసి తొలి ఎన్నికల సభను అడ్రస్ చేయబోతున్నారు అన్న మాట. ఈ నెల 17 అంటే అప్పటికి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు. అంటే ఎన్నికల ప్రచారాన్ని కూటమి తరఫున మోడీయే లాంచనంగా ప్రారంభిస్తారు అన్న మాట.

ఆ విధంగా మోడీ ఏపీలో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా తొలిసారి మాట్లాడుతారు అని అంటున్నారు. ఇప్పటిదాకా మోడీ జగన్ కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఆ మధ్యన అమిత్ షా విశాఖ వచ్చినపుడు జగన్ కి వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా జగన్ సర్కార్ ని తీవ్రంగా విమర్శించారు.

కానీ మోడీ మాత్రం ఎపుడూ ఏమీ అనలేదు. కానీ ఇపుడు ఆయన వైరి పక్షంలో ఉన్నారు. కూటమితో జట్టు కట్టారు. పైగా ఎన్నికల సీజన్. దాంతో జగన్ మీద మోడీ ఏ విధంగా విమర్శలు చేస్తారు అన్నది అందరికీ ఆసక్తిని రేపుతున్న విషయం అదే విధంగా చూస్తే గతంలో చంద్రబాబు సర్కార్ ని మోడీ ఏలూరు సభలో ఆనాటి ఎన్నికల వేళ పెద్ద ఎత్తున విమర్శించారు. పోలవరం ఏటీఎం గా బాబు మార్చుకున్నారు అని నిందించారు.

ఇపుడు అటు నుంచి ఇటు సీన్ మారింది. ఇపుడు అధికారంలో జగన్ ఉన్నారు. పోలవరం సహా అనేక సమస్యలు అలాగే ఉన్నారు. దాంతో జగన్ మీద ఈ తరహా విమర్శలు మోడీ చేస్తారా అన్నది చర్చగా ఉంది. అంతే కాదు ఏపీలో అవినీతి అక్రమాలు అరాచకాలు అని కూడా చంద్రబాబు పవన్ విమర్శించారు. ఇపుడు మోడీ నోటి వెంట కూడా ఆ తరహా విమర్శలు వినగలమా అన్నది అందరిలో కలుగుతున్న సందేహం. వీటికి సమాధానం 17న జరిగే సభలో మోడీ నోటి నుంచే వస్తుంది. అంతవరకూ వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News