రాహుల్‌ను పొగిడిన పాకిస్తాన్ మంత్రి.. మోడీ చేతికి బ్రహ్మాస్త్రం!!
ఎన్నికల వేళ.. ఏదో ఒక అంశంతో కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు ప్రధాని మోడీ.
ఎన్నికల వేళ.. ఏదో ఒక అంశంతో కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు ప్రధాని మోడీ. ఉన్నవా టిపై వ్యతిరేక ప్రచారం చేస్తుండడం ఒక ఎత్తు. కానీ, లేని వాటిని(మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పని వాటిని కూడా) కూడా ఎన్నికల ప్రచారంలోకి తీసుకువస్తూ.. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారు. ముస్లింలకు ఈ దేశ సంపద దోచిపెడుతుందని.. హిందువుల తాళిబొట్లు తెంచుతుందని కూడా.. లేనిపోని విమర్శలు చేస్తూ. కాంగ్రెస్ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఇలాంటి సమయంలో మోడీకి బ్రహ్మాస్త్రం వంటి అంశం చేతికి చిక్కింది. అదే మన దాయాది శత్రు దేశం పాకిస్థాన్.. నేరుగా రాహుల్‌గాంధీపై పొగడ్తలు కురిపించడమే. పాకిస్థాన్ మాజీ మంత్రి సీహెచ్ ఫవాద్ హుస్సేన్ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌పై ప్రశంసలు గుప్పించారు. రాహుల్ మాంచి ఫైర్ మీద ఉన్నార ని.. ప్రస్తుత ఎన్నికల సమయంలో భారత దేశంలో ఏం జరుగుతోందో రాహుల్ సమగ్రంగా వివరిస్తున్నార ని.. హుసేన్ పేర్కొన్నారు. ఇది పరోక్షంగా మోడీ సర్కారును విమర్శించడమే.
మరి ఇంత జరిగిన తర్వాత.. శత్రుదేశమే రాహుల్‌ను పొగిడిన తర్వాత.. మోడీ ఊరుకుంటాడా? బ్రహ్మాస్త్ర మే చిక్కిందని సంబర పడిపోవడమే కాదు.. ప్రసంగాల్లో రెచ్చిపోయారు కూడా.. ఒకవైపు బీజేపీ నేతలు.. రాహుల్‌ను రోడ్డు లాగేస్తే.. మోడీ ఏకంగా.. ఆయనను మరింత ఆడేసుకున్నారు.
``యువరాజు కోసం పాకిస్తాన్ నేతలు ప్రార్థిస్తున్నారు. వారి(కాంగ్రెస్-పాక్) మధ్య బంధం ఏంటో ఇప్పుడు తెలిసింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుంటే.. పాకిస్థాన్ చూడలేక పోతోంది. కన్నీరు పెట్టుకుంటోంది. కాంగ్రెస్ యువరాజును (రాహుల్) ప్రధానిని చేయాలని పాకిస్థాన్ ఉబలాట పడుతోంది. ఆది నుంచి కాంగ్రెస్‌కు-పాకిస్థాన్‌కు మధ్య పేగు బంధం ఉంది. అయితే.. అది ఇప్పుడు బయట పడింది`` అని ప్రధాని నిప్పులు చెరిగారు.
ఇదేసమయంలో ప్రస్తుతం భారత బలంగా ఉందన్న మోడీ.. ఈ బలం .. పాకిస్థాన్‌ను నిలువరిస్తోందని చెప్పారు. అందుకే.. ఈ దేశం బలహీనం కావాలని.. తమ ఆటలు సాగాలని పాకిస్థాన్ కోరుకుంటోందన్నా రు. కానీ, ఇక్కడ మోడీ ఉన్నాడు. అందుకే వారి ఆటలు సాగనివ్వడం లేదు. యువరాజు వస్తే.. బలహీన పడి.. పాకిస్థాన్ తన ఆటలు సాగించేందుకు సిద్ధమవ్వాలని చూస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ రావాలని అక్కడ(పాక్) ప్రార్థనలు చేస్తున్నారు.కానీ, ఈ దేశ ప్రజలు వారికి ఛాన్స్ ఇవ్వరు. ఈ దేశం మరింత బలపడుతుంది... అని ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు.