మోదీ హైదరాబాద్ సభలో మంద క్రిష్ణ.. పెద్ద ప్రకటనకు చాన్స్?
ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో జరగనున్న బహిరంగ సభలో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే సంచలన ప్రకటన ఏకంగా ప్రధాని మోదీ నోటి నుంచి రానున్నదనే కథనాలు వస్తున్నాయి.
ఎన్నికలకు ముందు తెలగాంణలో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చి విమర్శలు ఎదుర్కొన వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ.. తీరా ఎన్నికల ముంగిట కీలక ప్రకటనలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో వెనుకబడిన తర్వాత ఎంత చేసినా ఏమిటనే వాదన వినిపిస్తునప్పటికీ, ఆ పార్టీ చేసిన, చేయనున్న వాగ్దానాలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపేవిగా ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో జరగనున్న బహిరంగ సభలో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే సంచలన ప్రకటన ఏకంగా ప్రధాని మోదీ నోటి నుంచి రానున్నదనే కథనాలు వస్తున్నాయి.
ఈ అంచనానే నిజమైతే..?
తెలంగాణలో ఇప్పటికే నాలుగు రోజుల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీసీలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ సభకు జన సేన అధినేత పవన్ కల్యాణ్ నూ ఆహ్వానించి మైలేజీ పొందాలని చూశారు. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది బీజేపీ. ఇదే విషయాకిని ఎల్బీ స్టేడియం సభలో పవన్ కల్యాణ్ కూడా మద్దతు ప్రకటించారు. కాగా, ఇదే ఊపులో మరో సంచలన ప్రకటనకు బీజేపీ సిద్ధం అవుతున్నట్లు స్పష్టమవుతోంది.
నాంది దండోరాలో.. వర్గీకరణకు నాంది
ఎల్బీ స్టేడియంలో సభ జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ వస్తున్నా ప్రధాని మోదీ. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నాంది దండోరా సభలో పాల్గొననున్నారు. దీనికి అణగారిన వర్గాల విశ్వరూప మహా సభగా ట్యాగ్ లైన్ పెట్టారు. ఇక్కడ విశేషం ఏమంటే ఈ సభకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద క్రిష్ణ మాదిగ గౌరవ అతిథిగా పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ స్ధాయి నాయకుడు హాజరయ్యే సభలో మంద క్రిష్ణ పాల్గొనడం ఓ విధంగా సంచలన ప్రకటనకు వేదికగా భావిస్తున్నారు.
30 ఏళ్ల డిమాండ్ తీరుతుందా?
ఎస్సీ వర్గీకరణకు మంద క్రిష్ణ 30 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఎన్నికల్లో పోటీకీ దిగారు. ఎమ్మార్పీఎస్ ఉనికిని ఏదో విధంగా కొనసాగిస్తూ వస్తున్నారు. పోరాటంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తన పంథాను వీడలేదు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తితో వేదిక పంచుకోనున్నారు. మంద క్రిష్ణ గతంలో ఏ ప్రధానితోనూ ఒకే వేదిక మీద ఉన్న సందర్భాలు లేవు. శనివారం పరేడ్ గ్రౌండ్ సభలో మాత్రం ఆయన మోదీ పక్కన కూర్చోనున్నారు. కాగా, ఇదే సభలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేయనున్నారనే వాదన వినిపిస్తోంది. అదేమంటే.. ‘‘ఎస్సీ వర్గీకరణ’’. ఎస్సీల్లోని ఉప కులాలకు న్యాయం జరిగేలా వర్గీకరణకు మంద క్రిష్ణ చేస్తున్న పోరాటానికి సార్ధకత చేకూర్చేలా మోదీ ప్రకటన ఉండబోతున్నదనే కథనాలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు అవకాశం ఉన్నదో తెలియదు కానీ.. మోదీ, మంద క్రిష్ణ కలయిక మాత్రం అందుకేనని అంటున్నారు. ‘‘సమ న్యాయం సమాన అవకాశాలు’’ అనే ట్యాగ్ లైన్ తో శుక్రవారం పత్రికల్లో మోదీ సభకు సంబంధించి ప్రకటనలు కూడా రావడం గమనార్హం.
అదే జరిగితే సంచనలమే?
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధాని మోదీ ప్రకటన గనుక చేస్తే అది తెలుగు రాష్ట్రాల్లో పెను రాజకీయ సంచలనమే. వర్గీకరణను ఎస్సీల్లోని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాదిగలు గట్టిగా సమర్థిస్తున్నారు. ఏపీలో మాలలు అధికం. తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ. తెలంగాణ ఎన్నికల సమయంలో వర్గీకరణకు అనుకూలంగా ప్రధాన మంత్రి ప్రకటన చేశారంటే అది చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కాగా, వర్గీకరణ కోసం మంద క్రిష్ణ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. వెంకయ్య నాయుడుకు బహిరంగ సభలో పాదాభివందనం కూడా చేశారు. ఓ 15 ఏళ్ల కిందట వర్గీకరణ డిమాండ్ తో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గాంధీ భవన్ ను ముట్టడించి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంకా అనేక రూపాల్లో ఉద్యమాలు కూడా నడిచాయి. మరి రేపటి సభలో మోదీ వెంట ఎస్సీ వర్గీకరణకు హామీ లభిస్తే.. ఇప్పటివరకు జరిగిన వారి పోరాటానికి గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు. అయితే, ఎస్సీల్లో మిగతా వర్గాల ముఖ్యంగా మాలలకు ఆగ్రహం కలగకుండా ఉండేలా వర్గీకరణ ఉంటే అందరికీ మేలు.