మోడీ మంచి నాయకుడే కానీ... లోకల్ పెద్దలపై బాబూ మోహన్ ఫైర్!
బండి సంజయ్, కిషన్ రెడ్డి తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, తనను వారు కావాలనే దూరం పెట్టారని అని బాబు మోహన్ అభిప్రాయపడ్డారు.
మాజీమంత్రి, సీనియర్ నేత అయిన తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయదల్చుకోలేదని, ఎన్నికలతో సహా ప్రచారాలకూ దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. ఇదే సమయంలో... అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు.
అవును... తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో... టిక్కెట్ ఆశించి భంగపడిన వారు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లబుచ్చుతున్నారు. ఇందులో భాగంగా కొంతమంది పార్టీలు మారుతుంటే.. మరికొంతమంది సొంతపార్టీలోనే ఉంటూ తమ అసంతృప్తిని అధిష్టాణం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే బాబూ మోహన్ స్పందించారు.
ఈ క్రమంలో... తనను, తన కొడుకును కొంతమంది విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారని బాబు మోహన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం బీజేపీ టికెట్ వేరే వాళ్లకు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోందని.. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నా అని.. పార్టీ ప్రచారాలకు కూడా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తాఅని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన... తనకు టికెట్ ఇవ్వడంలేదని.. తనకు కాకుండా తన కొడుక్కి ఇస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు ఆయన దుయ్యబట్టారు. ఇదే సమయంలో... అనవసరమైన ఊహగానాలు, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికిన ఆయన... ఆత్మభిమానాని దెబ్బతీస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
బండి సంజయ్, కిషన్ రెడ్డి తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, తనను వారు కావాలనే దూరం పెట్టారని అని బాబు మోహన్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో... ఆందోల్ ప్రజలు తనను మూడు సార్లు ఆదరించారని గుర్తుచేసుకున్న బాబూ మోహన్... ప్రధాని నరేంద్ర మోడీ మంచి నాయకుడే కానీ.. ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని.. కనీసం మొదటి జాబితాలో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదనే కారణం కూడా చెప్పలేదని.. ఇది తనకు తీవ్ర మనోవేదన కలిగించిందని బాబూ మోహన్ తెలిపారు.
కాగా... 1998 ఉప ఎన్నికలలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబూ మోహన్... 1999లో మెదక్ జిల్లాలోని ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో 2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
అలా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో దామోదర రాజనర్సింహపై అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. తరువాత 2018 సంవత్సరంలో కేసీఆర్ మరోసారి టిక్కెట్ నిరాకరించేసరికి... భారతీయ జనతా పార్టీలో చేరారు! ఈ నేపథ్యంలో... బీజేపీని కూడా వీడే పరిస్థితి నెలకొందని తాజా పరిస్థితులను బట్టి అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు!