యుద్ధ బాధిత దేశానికి మోదీ బహుశా చరిత్రలో తొలి భారత ప్రధాని

బహుశా ఈ నష్ట నివారణకే ఏమో.. మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-07-27 06:18 GMT

ప్రపంచంలో ప్రస్తుతం రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. మరికొన్ని దేశాల్లో యుద్ధం స్థాయిలో కాకున్నా.. సంక్షోభకర పరిస్థితులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది ఉక్రెయిన్-రష్యా యుద్ధం. 2022 ఫిబ్రవరి 24న మొదలైందీ యుద్ధం. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. ఇప్పటికే 40 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది. మరోటి.. ఇజ్రాయెల్-గాజా యుద్ధం. గత ఏడాది అక్టోబరు 7న మొదలైందీ ఘర్షణ. రెండుచోట్లా ఇప్పటికీ కొన్ని వేలమంది బలైపోయారు. అయినా యుద్ధాలు ఆగడం లేదు. అయితే, వీటిలో భారత్ ఎటువైపు అనేది ప్రపంచం అంతా ఎదురుచూసింది. అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలపై.. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఐక్యరాజ్య సమితిలోనూ భారత్ నిర్దిష్ట అభిప్రాయాలతో ఉంది. ఇది యుద్ధాల కాలం కాదని.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పదేపదే సూచించింది. మోదీ కూడా ఓ దశలో పుతిన్ కు ఈ విషయం చెప్పారు. కానీ, రెండేళ్లు ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై సమాన దూరం పాటించిన మోదీ.. గత నెలలో అనూహ్యంగా రష్యాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం కూడా చేసుకున్నారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి చిర్రెత్తించింది. బహుశా ఈ నష్ట నివారణకే ఏమో.. మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇలా ఎపుడైనా జరిగిందా..?

రెండున్నరేళ్లుగా రష్యా చేస్తున్న దురాక్రమణ, దండయాత్రతో ఉక్రెయిన్ అల్లకల్లోలం అవుతోంది. ఇలాంటి దేశంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాల అధినేతలు ఎందరో పర్యటించారు. అయితే, మోదీ మాత్రం పర్యటించలేదు. ఇప్పుడు మాత్రం ఉక్రెయిన్ లో కాలుపెట్టనున్నారు. వచ్చే నెలలో ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 23న మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో భేటీ కానున్నట్లుగా జాతీయ మీడియా పేర్కొంటోంది. కాగా, నెల కిందట ఇటలీలో జరిగిన జి-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ, జెలెన్‌ స్కీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో మూడోసారి నెగ్గిన మోదీకి జెలెన్ స్కీ ఫోన్‌ చేశారు. తమ దేశానికి రావాల్సిందిగా కోరారు. దీంతో మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, యుద్ధం జరుగుతున్న ఓ దేశంలో భారత ప్రధాని ఒకరు పర్యటించడం గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు.

నష్ట నివారణకే..

రష్యా పర్యటనలో భాగంగా పుతిన్ తో గత నెలలో మోదీ సమావేశమయ్యారు. దీంతో.. యుద్ధంలో భారత్ రష్యా పక్షమేనని పరోక్షంగా చెప్పినట్లు అయిందనే విమర్శలు వచ్చాయి. అసలే.. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉంటే.. మోదీ మాత్రం ఆ దేశంలో కాలుపెట్టడం అనేక రకాల అభిప్రాయాలకు తావిచ్చింది. దీంతో నష్ట నివారణకే మోదీ ఉక్రెయిన్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News