మోదీ 3.0నా.. ఎన్డీయే 3.0నా?
ఈ నేపథ్యంలో మోదీ 3.0 అని దేశవ్యాప్తంగా, నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో మిత్ర పక్షాల అవసరం లేకుండానే కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సీట్లను గెల్చుకుంది. 2019లో బీజేపీ ఒక్కటే ఏకంగా 303 స్థానాలతో దుమ్ములేపింది. 2024 ఎన్నికల్లోనూ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాల కంటే ఎక్కువగా మొత్తం 300 స్థానాలను గెలుచుకోవాలని ఆశించింది. ఎన్డీయే పక్షాలతో కలిపి మొత్తం 400 స్థానాలను కొల్లగొడతామని ఉధృత ప్రచారం చేసింది. అయితే బీజేపీ కూటమికి 400 స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రతిపక్షాలు ప్రచారం చేయడంతో బీజేపీ నష్టపోయింది.
2014, 2019 ఎన్నికల్లో మిత్ర పక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వ అవసరమైన 272 సీట్లను సాధించిన బీజేపీ ఈసారి 240 సీట్లకే పరిమితమైంది. మెజార్టీకి 32 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్ర పక్షాలపైన ఆధారపడక తప్పలేదు.
ఈ నేపథ్యంలో మోదీ 3.0 అని దేశవ్యాప్తంగా, నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోవడంతో మోదీ 3.0 సర్కార్ అనడం సరికాదని అంటున్నారు. పదేళ్ల తర్వాత దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. మిత్ర పక్షాలు లేకపోతే బీజేపీ ప్రభుత్వం లేదని.. కాబట్టి ఎన్డీయే 3.0 అనాలని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.
జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రికార్డును మోదీ దక్కించుకున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టడంతో అంతా మోదీ 3.0 అని కీర్తిస్తున్నారని అంటున్నారు.
అయితే కేంద్రంలో బీజే పీ ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీలదేనని చెబుతున్నారు. టీడీపీ 16 ఎంపీ సీట్లను గెలుచుకోగా, జేడీయూ 12 ఎంపీ సీట్లను గెలుచుకున్నాయి. అలాగే శివసేన (ఏకనాథ్ షిండే) 7 ఎంపీ సీట్లను సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లకు గానూ బీజేపీ 32 సీట్ల దూరంలో నిలిచిపోయింది. 240 సీట్లే సాధించడంతో మరో 32 మంది ఎంపీల అవసరం పడింది. ఈ 32 మందిని టీడీపీ 16, జేడీయూ 12, శివసేన (షిండే) 7 భర్తీ చేశాయి. ఇంకా జేడీఎస్ 2, జనసేన 2, అప్నాదళ్ 1, తదితర పార్టీలు కూడా మద్దతు పలికాయి.
ఈ నేపథ్యంలో మోదీ 3.0 అనడం సరికాదని.. ఎన్డీయే 3.0 అనడం కరెక్ట్ అని అంటున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ శివ్ ఖేరా స్పందించారు. మోదీ 3.0 కాదని ఎన్డీయే 3.0 ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఇంకా స్పష్టత కావాలనుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబునో, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ను ఈ విషయంపై ప్రశ్నించాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.