బాబు ఆరోగ్యంపై మోడీ ఆరా అంటున్న టీడీపీ ఎంపీ!

ఈ సమయంలో చంద్రబాబు ఆరోగ్యం పై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసారాని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

Update: 2023-10-14 08:03 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం ప్రధాని స్పందించారని చెబుతున్నారు టీడీపీ ఎంపీ.

అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు స్కిన్ అలర్జీ వచ్చిందని, వైద్యం ఇప్పిస్తున్నామని, రోజూ మూడుపూటలా వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు ఆరోగ్యం పై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసారాని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా చంద్రబాబు కేసుల అంశాన్ని ప్రధానికి వివరించినట్లు వెల్లడించిన రవీంద్ర... బాబు ఆరోగ్యంపై ఆయన ఆరా తీశారని అన్నారు! దీనికి సమాధానంగా... ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించినట్లు చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో చంద్రబాబు భద్రత, వైద్య సేవలపై దృష్టి సారించాలని కోరుతూ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేల రవీంద్ర కుమార్ లేఖ రాశారని చెబుతున్నారు. ఇందులో భాగంగా... చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు! అదేవిధంగా... చంద్రబాబుకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఇప్పటికే బాబు ఆరోగ్యం, భద్రత విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై కోస్తా ప్రాంత జైళ్ల డీఐజీ పూర్తి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, కోర్టు ఆదేశాల మేరకు బాబుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని తెలిపారు. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్ కావటం తో ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ ను కేటాయించి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసామని క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో... ముగ్గురు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని.. రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ఆయన ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వద్దని సూచించారు. ఇదే సమయంలో చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారంటూ వస్తున్న కామెంట్లపైనా అధికారులు స్పందించారు. జైలుకు వచ్చినప్పటికంటే ఆయన ఒక కిలో బరువు పెరిగారని తెలిపారు.

అదేవిధంగా... జైళ్ల శాఖ మాన్యువల్‌ లోని 385, 386, 1037 నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం వీఐపీ ఖైదీలకు నిర్దేశించిన అన్ని సదుపాయాలను చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు తెలిపిన అధికారులు... ఏసీ గానీ ఎయిర్‌ కూలర్‌ గానీ కల్పించే వెసులుబాటు లేదని, ఆయన గదిలో 8 ఫ్యాన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దోమలు రాకుండా రెగ్యులర్ గా ఫాగింగ్ చేస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News