మోడిలో భయం మొదలైందా ?
కూటమి పేరులో ఇండియా అని ఉండటాన్ని మోడీ తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమవుతోంది. కూటమి పేరు లో ఇండియా అని ఉంటే మోడీకి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలీటంలేదు
ఇండియా కూటమి ఏర్పడిన దగ్గరినుండి నరేంద్రమోడీ పదేపదే కూటమి పై మాటల తో దాడులుచేస్తున్నారు. ఇండియా కూటమిని అవహేళన చేస్తు ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై ఎన్డీయే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియాకూటమిని ఉద్దేశించి ఇండియా కాదు ఘమండియే అని అభివర్ణించారు. ఇండియా నేతల ను అహంబావులుగా మోడీ వర్ణించారు. దేశాన్ని దోచుకుతినటానికే ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా పేరు పెట్టుకున్నట్లు ఎద్దేవా చేశారు.
కూటమి పేరులో ఇండియా అని ఉండటాన్ని మోడీ తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమవుతోంది. కూటమి పేరు లో ఇండియా అని ఉంటే మోడీకి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలీటంలేదు. కూటమి పేరులో ఇండియా అని ఉండకూడదని అనుకుంటే మరి బీజేపీ పూర్తి పేరు భారతీయ జనతా పార్టీయే కదా.
అంటే బీజేపీ లో కూడా భారతీయ అని ఉండచ్చా ? హిందీ లో భారతీయ అన్న పదానికి ఇంగ్లీషులో ఇండియానే కదా. దేశం పేరును హిందీ లో బీజేపీ వాళ్ళు పెట్టుకుంటే ఇంగ్లీషులో ఇండియా అని వచ్చేట్లుగా కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి పెట్టుకున్నదంతే.
ఇంతోటి దానికి మోడీ ఎందుకు పదేపదే ఎద్దేవా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒకవిషయమైతే అర్ధమవుతోంది. అదేమిటంటే ఇండియా కూటమి అంటే మోడీలో టెన్షన్ మొదలైందని. ఎన్డీయేకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లోని ఇన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తాయని మోడీ ఊహించుండరు. కొత్త కూటమిగా ప్రతిపక్షాలు ఏర్పడటమే కాకుండా ఇపుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో సమిష్టిగా కేంద్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటం లో భాగంగానే మణిపూర్ అల్లర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఇక ఆచితూచి మాట్లాడటంలో సుష్మాస్వరాజ్ నే అందరు ఆదర్శంగా తీసుకోవాలని మోడీ భాగస్వమ్యపార్టీల నేతలకు చెప్పటమే విచిత్రంగా ఉంది. అసలు మోడీయే ప్రతిపక్షాల పై నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. పార్లమెంటులో ప్రతిపక్షాల కు సమాధానం చెప్పాల్సిన మోడీ బయటెక్కడో మాట్లాడుతుంటారు. మాట్లాడేది కూడా అడ్డు అదుపులేకుండా రెచ్చగొడుతు మాట్లాడుతారు.
మొత్తానికి మోడీ భయపడేట్లుగా ఇండియా కూటమి గట్టిగానే పోరాడుతున్నట్లు అనుకోవాలి. తానెంతో బలమైన నేతనని, ప్రపంచంలోని అత్యంత బలమైన నేతల్లో తాను కూడా ఒకడినని అనుకునే మోడీ ప్రతిపక్ష ఇండియా కూటమి గురించి పదేపదే మాట్లాడుతున్నారంటేనే అర్ధమైపోతోంది ఎంతగా భయపడుతున్నారో.