రీల్స్ లో మునిగారా? ఒలింపియన్లకు మోదీ ప్రశ్న.. ఫోన్ లాక్కున్నారన్న లక్ష్య

పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్ కేవలం ఆరు పతకాలతో సరిపెట్టుకున్నా.. భారత క్రీడాకారుల ప్రయత్నాన్ని మాత్రం గుర్తించారు ప్రధాని మోదీ

Update: 2024-08-16 20:30 GMT

పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్ కేవలం ఆరు పతకాలతో సరిపెట్టుకున్నా.. భారత క్రీడాకారుల ప్రయత్నాన్ని మాత్రం గుర్తించారు ప్రధాని మోదీ. అందుకే వారు తిరిగిరాగానే సమావేశం ఏర్పాటు చేశారు. వారితో ప్రతి ఒక్కరితో మాట్లాడారు.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. కాగా.. కొందరు అథ్లెట్లు మొబైల్ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతూ రీల్స్ చేసేందుకు సమయం కేటాయించినట్లు కథనాలు రావడంతో మోదీ స్పందించారు. రీల్స్ చూసేందుకు, చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం నిజమేనా? అని ప్రశ్నించారు. మీలో ఎవరు రీల్స్ చేశారని అడిగితే.. ఎవరూ స్పందించలేదు. కాగా, ఒలింపిక్స్ సమయంలో ప్రియాంక గోస్వామి రీల్ వైరల్ కావడంతో సోషల్ మీడియాకే మన క్రీడాకారులు ప్రాధాన్యం ఇచ్చారనే కథనాలు వెలువడ్డాయి.

లక్ష్య.. ఏమంటావ్..

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ లో పతకం సాధిస్తాడని లక్ష్య సేన్ పై చాలా ఆశలున్నాయి. కానీ, అతడు కీలక సమయంలో ఓడిపోయాడు. దీనిపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరగడంతో నీ అభిప్రాయం ఏమిటంటూ లక్ష్య ను మోదీ ప్రశ్నించారు. ‘‘సర్.. అవేమీ నాకు తెలియదు. నాకు తెలియకుండా కోచ్‌ ప్రకాశ్‌ పదుకొనే ఫోన్‌ ను దూరంగా ఉంచారు’’ అని చెప్పాడు. ‘‘మ్యాచ్ ల సమయంలో నా దగ్గర ఫోన్ లేదు. ప్రకాశ్ సర్ తీసుకున్నారు. ఆయన చాలా కఠినం. ఏకాగ్రత కోల్పోకూడదని ఇలా చేశారు’ అని చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్‌ తో చాలా అనుభవం వచ్చిందని.. చాలా నేర్చుకున్నానని తెలిపాడు. అయితే, పతకానికి చేరువగా వచ్చి ఓడిపోవడం బాధించిందన్నాడు. వచ్చేసారి పతకం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నానని చెప్పాడు.

కాగా వరుసగా రెండోసారి హాకీలో కాంస్య పతకం తెచ్చిన భారత జట్టును మోదీ అభినందించారు. గోల్ కీపర్, జట్టులో అడ్డుగోడలాంటి శ్రీజేశ్‌ కు గుర్తుండిపోయేలా ఫేర్‌ వెల్ ఇచ్చారని కొనియాడారు. ప్రధానితో భేటీ సమయంలో శ్రీజేశ్‌ మాట్లాడుతూ.. ‘‘రిటైర్‌ అవ్వాలని చాన్నాళ్లుగా ఆలోచిస్తూన్నా. వీడ్కోలు ఎప్పుడని సహచరులు ఆట పట్టించేవారు. 20 ఏళ్లు నా జట్టు కోసం ఆడా. రిటైర్‌ కు మంచి వేదికగా ఉండాలని భావించా. ఒలింపిక్స్‌ పతకం తర్వాత మంచి సమయం లేదని భావించా’’ అని వివరించాడు.

వినేశ్.. వీర పుత్రిక

ఒలింపిక్స్‌ రెజ్లింగ్ లో అద్భుత ప్రదర్శన చేసినా కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోయిన రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ ను ‘వీర పుత్రిక’ అని మోదీ అభివర్ణించారు. ఒలింపియన్లతో స్వాతంత్ర్య దినోత్సవాన ఆయన మాట్లాడారు. తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం హైలైట్స్‌ను మోదీ ట్వీట్ చేశారు. పతకం తేలేకపోయానని రెజ్లర్ రితికా హుడా బాధపడగా.. ‘నువ్వింకా చిన్నదానివే. ప్రాక్టీస్‌ కొనసాగించు. నువ్వు ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉంది’’ అని మోదీ ఓదార్చారు. రెండు కాంస్యాలు గెలుచుకున్న స్టార్‌ షూటర్‌ మను బాకర్.. మోదీకి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఎయిర్‌ పిస్టల్‌ ను కానుకగా ఇచ్చింది.

Tags:    

Similar News