దేవుడే మాపై అవిశ్వాసం పెట్ట‌మ‌ని విప‌క్షాల‌కు చెప్పాడు: మోడీ వ్యంగ్యాస్త్రాలు

ప్రతిపక్షాలకు ఆ దేవుడే అవిశ్వాసం పెట్ట మని చెప్పి ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Update: 2023-08-10 16:28 GMT

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా విప‌క్ష కూట‌మి అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై చివ‌రిరోజైన మూడోరోజు గురువారం సాయంత్రం సుదీర్ఘ స‌మాధానం ఇచ్చిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఆసాంతం కాంగ్రెస్‌తో ఆడేసుకున్నారు. "అస‌లు ఎందుకు అవిశ్వాసం పెట్టారో వారికి కూడా తెలియ‌దు" అని వ్యాఖ్యానించారు. "మా ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్ర‌తిసారీ వారే అభాసుపాల‌వుతున్నారు" అని మోడీ చెప్పారు.

అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని, దీనివ‌ల్ల త‌మ ఆత్మ నిర్భ‌ర‌త మ‌రింత ద్విగుణీకృతం అవుతోంద‌ని మోడీ చెప్పారు. ప్రతిపక్షాలకు ఆ దేవుడే అవిశ్వాసం పెట్ట మని చెప్పి ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ అవిశ్వాసం తమకు ఎప్పటికీ అదృష్టమేనన్నారు. "మేం మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయి. అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయి" అని మోడీ చెప్పుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలోనూ కాంగ్రెస్ పార్టీ అనేక సంద‌ర్భాల్లో అవిశ్వాసం పెట్టింద‌ని.. మోడీ అన్నారు. "క్రికెట్ ప‌రి భాషలో చెప్పాలంటే విపక్షాలు వరుసగా నోబాల్స్‌ వేస్తుంటే.. అధికార పక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోంది" అని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

"అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఎన్డీయే అధికారంలోకి వస్తుంది. ఇటీవల మా ప్రభుత్వం అనేక కీలక బిల్లులను సభలో ఆమోదించింది. వీటిపై విపక్షాలకు ఏమాత్రం ఆసక్తి లేదు.' దేశ ప్రజల పట్ల విపక్షాలు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాయి. పేదల గురించి ఆలోచన లేదు. అధికారంలోకి రావడమే వారి పరమావధి. ఇప్పటి వరకు దేశాన్ని కాంగ్రెస్ కూట‌మి పార్టీలు నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప.. చేసిందేమీ లేదు. విపక్ష నేతలు వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు. " అని ప్ర‌ధాన మంత్రి నిప్పులు చెరిగారు.

Tags:    

Similar News