హమాస్ మాస్టర్ మైండ్... "ద క్యాట్ విత్ నైన్ లైవ్స్"!
ఇజ్రాయేల్ పై ఎవరూ ఊహించని రీతిలో.. ఆ దేశం సైతం అనుకోని రీతిలో.. హమాస్ ఉగ్రవాద సంస్థ భయంకరమైన దాడులకు తెగించింది
ఇజ్రాయేల్ పై ఎవరూ ఊహించని రీతిలో.. ఆ దేశం సైతం అనుకోని రీతిలో.. హమాస్ ఉగ్రవాద సంస్థ భయంకరమైన దాడులకు తెగించింది. కట్టుదిట్టమైన ఐరన్ కంచె ఇజ్రాయేల్ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ... వారి అలసత్వాన్ని ఆయుధంగా మార్చుకుని రంగంలోకి దిగింది హమాస్. శక్తివంతమైన ఐరన్ డోం ఉన్నప్పటికీ.. దాని బలహీనతలను అంచనా వేయగలిగింది. అయితే... వీటన్నింటి వెనుకా ఒక మాస్టర్ మైండ్ ఉంది... అదే అతడి పేరు మొహమ్మద్ డెయిఫ్..!
అవును... గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ సైన్యం, మొస్సాద్ నిఘా సంస్థ భూతద్దం వేసుకొని మరీ గాలింపు చర్యలు చేపడుతున్నా.. పలు మార్లు చిక్కినట్లే చిక్కి చేజారిపోతున్న మొహమ్మద్ డెయిఫ్... "ఆపరేషన్ అల్ అక్సా స్ట్రాం" వెనుకున్న మాస్టర్ మైండ్ అని చెబుతున్నారు. దీంతో ఎవరు ఇతడు, ఏమి చదువుకున్నాడు, ఎక్కడి వాడు, ఎందుకిలా మారాడు అనే మొదలైన ప్రశ్నలు ఇప్పుడు ఆన్ లైన్ వేదికపై హల్ చల్ చేస్తున్నాయి.
మొహమ్మద్ డెయిఫ్.. పూర్తి పేరు మహమ్మద్ డియాబ్ ఇబ్రహీం అల్ మస్రీ. ఇతడు 1965లో గాజాలోని శరణార్థి శిబిరంలో పుట్టాడు. తన 15వ ఏటే... 1980లో హమాస్ లో చేరాడు. ఈ మస్త్రీ పేరు డెయిఫ్ గా మారడానికి ఒక కథ ఉంది. హమాస్ ఉగ్రవాదులు తమ ఉనికి ఇజ్రాయెల్ దళాలకు తెలియకుండా రోజుకు ఒక సానుభూతిపరుడి ఇంట్లో దాక్కొంటారు. అందుకనే మస్రీ పేరు డెయిఫ్ గా మారింది. డెయిఫ్ అంటే అరబిక్ భాషలో అతిథి (గెస్ట్) అని అర్థం.
హమాస్ బాంబుల తయారీ నిపుణుడు, గతంలో ఇజ్రాయెల్ దళాలపై పలు బాంబుదాడులు చేసిన అయ్యాష్ కు ఈ డెయిఫ్ సన్నిహితుడు. ఈ క్రమంలో అయ్యాష్ ని ఇజ్రాయెల్ దళాలు హతం చేయడంతో.. 2002లో హమాస్ లోని మిలటరీ వింగ్ నాయకత్వ బాధ్యతలు డెయిఫ్ కి అందాయి. గాజా టన్నెల్ నెట్ వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా అతడే అని చెబుతారు.
ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయేల్ కి చెందిన బందీలను ఈ టన్నెల్స్ లోనే ఉంచారని చెబుతున్నారు. ఈ నెట్ వర్క్ ని చేదించడం అంత ఈజీ కాదనేది అంతా చెబుతున్న మాట. ఈస్థాయిలో స్కెచ్ లు వేసే ఈ మాస్టర్ మైండ్ కోసం ఇజ్రాయెల్ దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే ఇతనికున్న ప్రత్యేకమైన అలవాట్లే ఇతడికి రక్షణగా ఉన్నాయని చెబుతారు.
హమాస్ వాడే కస్సాం అనే రాకెట్ల తయారీలోనూ కీలక పాత్ర పోషించేటంత నిపుణుడైన డెయిఫ్... కమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్లు వాడడు. తన రహస్య జీవితం నుంచి అస్సలు బయటకు రావాలని కోరుకోడు. దీంతో నిఘా సంస్థలకు అతడిని గుర్తించడం దాదాపు అసాధ్యమవుతోంది.
ఈ క్రమంలో ఏదోలాగా ఇతడి ఆచూకి కనుకొన్న ఇజ్రాయెల్ దళాలు ఇతడిపై ఇప్పటివరకూ సుమారు ఏడు సార్లు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ప్రతిసారీ ఆముదం రాసుకున్న దొంగలో చిక్కినట్లే చిక్కి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో జరిగిన దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడని చెబుతుంటారు. ఆ దాడిలో ఇతడికి ఒక కన్నుతోపాటు మరి కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయని అంటారు.
2006లో హమాస్ సభ్యుడి ఇంట్లో ఉండగా జరిగిన దాడిలో మరోసారి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం 2014లో ఐదోసారి జరిగిన దాడి నుంచి కూడా డెయిఫ్ బయటపడ్డాడు. కాకపోతే ఈ దాడిలో అతడి భార్య, పిల్లలు మరణించారు. ఇదే క్రమంలో... 2021 గాజాపై జరిపిన ఆపరేషన్ లో కూడా రెండు సార్లు తప్పించుకొన్నాడు. ఇలా ప్రతీసారీ చిక్కినట్లే చిక్కి తప్పించుకోవడంలో దిట్ట అయిపోవడంతో ఇతడిని "ద క్యాట్ విత్ నైన్ లైవ్స్" అని పిలుస్తారు.
ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయేల్ పై సుమారు 20 నిమిషాల వ్యవధిలో 5000 రాకెట్లు ప్రయోగించిన పనిలోనూ ఇతడితే మాస్టర్ మైండ్ అని తెలియడంతో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అతడి కోసం మరోసారి వేటను తీవ్రతరం చేసింది. ప్రస్తుతం గాజా మొత్తం అతడికోసం జల్లెడపడుతోంది.