మూన్ లైటింగ్ చేసిన టెక్కీలకు ఐటీ షాక్!
ఎవరైతే తమ అదనపు ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ప్రకటించలేదో వారికి ఈ నోటీసులు వెళుతున్నట్లు తెలుస్తోంది
గతకొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికలపై "మూన్ లైటింగ్" గురించి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూన్ లైటింగ్ అంటే మాతృసంస్థకు తెలియకుండా ఉద్యోగి వేరే సంస్థల కోసం పనిచేయడం. అయితే కరోనా కాలంలో ఇది బాగా వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రం హోం స్టార్ట్ అయిన అనంతరం ఇది తీవ్రతరమైంది.
ఈ విషయాలపై దాదాపు టాప్ ఐటీ కంపెనీలన్నీ స్పందించాయి. ఉద్యోగులకు ఈ విషయంపై ఇన్ఫోసిస్ ఒక ఇ-మెయిల్ ను పంపించింది. ఇలాంటి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇదే సమయంలో చాలా ఐటీ కంపెనీలు ఇలాంటి వ్యాఖ్యలే చేశాయి.
ఈ సమయంలో తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఎంటరైంది. కంపెనీల కళ్లు కప్పి ఒకేసారి రెండు జీతాలు అందుకున్న వారిపై మెుదటి విడత చర్యలు చేపట్టింది. దీంతో ఈ అంశం మరోసారి చర్చల్లో నిలిచింది.
అవును... మూన్ లైటింగ్ చేసిన ఉద్యోగులు ప్రస్తుతం ఐటీ శాఖ రాడార్ లోకి వచ్చారు. తాజాగా ఆదాయపు పన్ను శాఖ సాధారణ జీతం కంటే ఎక్కువ సంపాదించిన నిపుణులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. ఎవరైతే తమ అదనపు ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ప్రకటించలేదో వారికి ఈ నోటీసులు వెళుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇన్ కం టాక్స్ అధికారులు దాదాపు 1,100 మందికి నోటీసులు పంపినట్లు సమాచారం. మరింత మందికి త్వరలోనే నోటీసులు రావొచ్చని తెలుస్తోంది. ఇందులో చాలా వరకు సంబంధించినవి అంటే కరోనా కాలానికి (2019-2020, 2020-2021) సంబంధించిన ఆర్థిక సంవత్సరాల్లో రిటర్న్స్ ఫైల్ చేసిన వ్యక్తులకు నోటీసులు జారీ అయ్యాయని అంటున్నారు.
మెుదటి దశలో లో రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి నోటీసులు పంపినట్లు చెబుతున్నారు. కంపెనీల వద్ద పాన్ కార్డు వివరాల ఆదారంగా అధికారులు పన్ను ఎగవేతదారులను గుర్తించేపనిలో ఉన్నారని సమాచారం. కరోనా సమయంలో ఐటి రంగంలో, ముఖ్యంగా ఇంటి నుంచి పని చేసే వ్యక్తుల వల్ల మూన్ లైటింగ్ ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే.
కాగా... సాధారణంగా రోజులో ఎనిమిది నుంచి తొమ్మిది గంటలపాటు మాతృసంస్థ కోసం పనిచేసిన ఉద్యోగులు రాత్రిపూట ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. అందుకే దీన్ని "మూన్ లైటింగ్" గా పిలుస్తున్నారు. అలా అని దీనికి ఒక నిర్దేశిత సమయం అంటూ ఉండదు. మాతృసంస్థల్లో నైట్ షిఫ్టులు చేసేవారు కూడా మధ్యాహ్నం పూట వేరే సంస్థ కోసం పనిచేస్తుంటారు.