మోపిదేవి మెడలో టీడీపీ కండువా పడేదెప్పుడు ?

చివరి నిముషం వరకూ ఆయన పార్టీని వీడుతారని ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని కానీ వైసీపీ పెద్దలకు ఎవరికీ తెలియదు.

Update: 2024-09-07 03:45 GMT

వైసీపీ వ్యవస్థాపక సభ్యుడిగా అంతకంటే ముందు కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన నేతగా వైఎస్సార్ కి ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ రాజకీయ భవితవ్యం మీద ఇపుడు చర్చ సాగుతోంది. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.

చివరి నిముషం వరకూ ఆయన పార్టీని వీడుతారని ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని కానీ వైసీపీ పెద్దలకు ఎవరికీ తెలియదు. అంతలా జాగ్రత్త పడిన ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయగానే టీడీపీలో చేరుతారు అని అంతా అనుకున్నారు

ఈ మేరకు తగిన హామీ దక్కడంతోనే ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు అని చర్చ సాగింది. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేసి పది రోజులు గడచినా మోపిదేవి టీడీపీలో చేరే విషయం మీద క్లారిటీ అయితే రావడం లేదు. ఆయనను టీడీపీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి ఇస్తారని, ఆ తరువాత ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తును చూపిస్తారని ప్రచారం సాగింది.

ఈ కీలక హామీలతోనే ఆయన పార్టీని వీడారు. నిజానికి మోపిదేవికి వైసీపీ హై కమాండ్ తో విభేదాలు వచ్చింది కూడా ఇక్కడే. ఆయన రేపల్లె చుట్టూ తన రాజకీయాన్ని అల్లుకున్నారు. తాను లోకల్ పాలిటిక్స్ చేయాలని అనుకున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆయనను పెద్దల సభకు పంపించింది. దీంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం రేపల్లె టికెట్ ని వేరే వారికి ఇచ్చింది. దాంతో మోపిదేవికి రేపల్లెలో పట్టు జారుతోందని కలవరం రేగడంతో రాజ్యసభ సీటుని సైతం వదులుకుని వచ్చారు. వైసీపీలో అయితే రేపల్లె రాజకీయాలలో అవకాశం ఉండదని భావించి టీడీపీలో చేరారు

అయితే ఈ మొత్తం వ్యవహారంలో మోపిదేవి మరచిపోయింది ఏంటి అంటే తన రాజకీయం మొత్తం టీడీపీకి యాంటీగా చేశాను అని. టీడీపీలో నియోజకవర్గం నేతలు తన రాకను ఎంత మేరకు స్వాగతిస్తారో అన్న అంచనాను ఆయన వేసుకోలేకపోయారు అని అంటున్నారు. రేపల్లె నుంచి తాజాగా మరోసారి గెలిచిన అనగాని సత్యప్రసాద్ అత్యంత కీలకమైన రెవిన్యూ మంత్రిగా ఉన్నారు.

ఆయన 2014, 2019, 2024లలో వరసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలంగా అక్కడ పాతుకుని పోయారు. పైగా ఇపుడు మంత్రిగా ఉన్నారు. ఆయన తన హవానే కొనసాగాలని కోరుకుంటారు. నిన్నటిదాకా వైసీపీలో ఉంటూ ప్రత్యర్థిగా ఉన్న మోపిదేవి ఇపుడు సైకిలెక్కి తమ పక్కకు వస్తామంటే అనగాని వర్గం ససేమిరా అని అంటోందని టాక్.

ఆయన అవసరం పార్టీకి లేదని హై కమాండ్ కి చెబుతోందిట. ఆయనను టీడీపీలో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇస్తే పచ్చగా ఒకే వర్గంగా ఉన్న రేపల్లె టీడీపీలో వర్గ పోరు పెచ్చరిల్లుతుందని అది పార్టీకి ఏ మాత్రం మంచిది కాదని హై కమాండ్ కి కూడా అనగాని సత్యప్రసాద్ వర్గం గట్టిగానే చెబుతోంది అని అంటున్నారు.

దాంతో మోపిదేవి టీడీపీలో చేరిక వాయిదా పడింది అని అంటున్నారు. ఒక వేళ ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు మోపిదేవి మెడలో పసుపు కండువా వేసినా ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా బంగారం లాంటి రాజ్యసభ పదవిని మోపిదేవి అనవసరంగా వదులుకున్నారా అన్న చర్చ అయితే ఉంది. దశాబ్దాల పాటు రాజకీయ వైరం ఉన్న వారు ఒక్కసారిగా ఎలా కలసిపోతారు అన్నదే ఇక్కడ పాయింట్. అందుకే ఎవరి శిబిరంలో వారు ఉండాల్సిందే. కాదని బయటకు వస్తే ఎటూ కాకుండా పోతారని అంటున్నారు.

Tags:    

Similar News