సీఎం రేవంత్‌కు రెండు ‘ఫైర్ టెస్టులు’!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ సారథిగా పాలన ప్రారంభించి మరికొన్ని రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కారు తలకెత్తుకున్నరెండు ప్రధాన అంశాలు.. పేదలతో ముడి పడి ఉండడం.. వీటిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయడంతో ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎలా ముందుకు వెళ్తారు? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక, పోలింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇక, నుంచి ఈ రెండు అంశాల విషయంలో రేవంత్ అడుగులు కీలకంగా మారనున్నాయి.
1) ఫార్మా సిటీ: వికారాబాద్‌లోని లగచర్ల గ్రామీణ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్టే ఫార్మా సిటీ వ్యవహా రం సర్కారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. స్థానికుల నుంచి భూములు సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలో జరిగిన కలెక్టర్ పై దాడి ఒకవైపు రాజకీయ రచ్చ, చర్చగా మారగా మరోవైపు ఈ కేసులో దళితులను అరెస్టుచేసి జైల్లో పెట్టడం.. లాఠీ చార్జి చేయడం వంటివి జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి. ఎస్టీ కమిషన్ కూడా.. ఈ విషయంపై దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయి విచార ణకు రానుంది. ఇంకోవైపు.. బీఆర్ ఎస్ నాయకులు దీనిని తమకు అవకాశంగా అందిపుచ్చుకున్నారు. దీంతో ఈ ఫార్మా సిటీ వ్యవహారాన్ని కాదనలేని.. ఔననలేని పరిస్థితి ఏర్పడింది. పైగా పేదల కుటుంబాలతోపాటు.. ఎస్టీ సామాజిక వర్గాలతో ముడి పడిన వ్యవహారం కావడంతో దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ క్రమంలో పారిశ్రామికంగా వేసే అడుగులు.. సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయం వంటివి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి. ఈ వ్యవహారాన్ని బట్టే భవిష్యత్తులో పరిశ్రమలు వచ్చేందుకు వీలుంది.
2) మూసీ ప్రక్షాళన: మూసీ ప్రక్షాళన విషయం మరో రాజకీయ రచ్చగా మారింది. మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాదీ ల మనసు దోచుకోవడంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోవాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. మరోవై పు.. వందల ఏళ్ల నుంచి కూడా పట్టించుకోకుండా ఉన్న గణనీయమైన ఈ ప్రాజెక్టును మెరుగు పరచడం ద్వారా తెలంగాణకు గొప్ప పేరు తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. అయితే.. దీనికి రాజకీయ గ్రహణాలు ముసురుకున్నాయి. మూసీ ప్రక్షాళనకు.. పేదల ఇళ్లకు లింకు పెట్టి.. ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం ప్రజల్లో విస్తృతంగా చర్చకు వస్తోంది. ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఈ వ్యవహారంలో చేస్తున్న వ్యాఖ్యలు సైతం సర్కారుకు తలనొప్పిగా మారింది. మరోవైపు మూసీని ప్రక్షాళన చేసే తీరుతామని రేవంత్ చెబుతున్నా.. దీనికి సంబంధించి అనేక చిక్కుముళ్లను ఆయన ఎలా ఛేదిస్తారన్నది చూడాలి. ఎలా చూసుకున్నా.. ఈ రెండు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు, పాలనకు కూడా అగ్నిపరీక్షలుగా మారాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.