పవన్ పై క్రిమినల్ కేసు తొలగింపు... ఫిర్యాదు చేయలేదన్న వాలంటీర్లు!

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-19 04:12 GMT

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... వాలంటీర్లను అసాంఘిక శక్తులుగా, మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నవారికి సహకారులుగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారంటూ పలు ఫిర్యాదులు అందాయి!

అప్పట్లో పలువురు వాలంటీర్లు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేసినట్లు, రహదారులపై నిరసన వ్యక్తం చేసినట్లు కథనాలొచ్చాయి. ఈ క్రమంలో... గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. పవన్ తమ మనోభావాలను కించపరిచారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు!

ఈ సమయంలో... ఈ ఫిర్యాదుల ఆధారంగా పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ గత ఏడాది జూలై 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వ్యులు ఇచ్చారు. దీంతో... గుంటూరు జిల్లాలో పవన్ పై ఐపీసీ 499, 500 సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.

ఈ క్రమంలో.. ఈ క్రిమినల్ కేసుల వ్యవహారం ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యింది. దీంతో న్యాయమూర్తి.. పవన్ కు నోటీసులు పంపారు. అయితే... ఈ కేసుతో తమకు సంబంధం లేదని, ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదులో తాము సంతకాలు కూడా చేయలేదని తాజాగా వాలంటీర్లు చెప్పారు.

అవును... గతంలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీటిపై అప్పటి ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అయితే.. ఆ కేసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫిర్యాదుల్లో తమ సంతకాలు కూడా లేవని తాజాగా వాలంటీర్లు కోర్టుకు తెలిపారు!

దీంతో... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా... గత ఏడాది జూలై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో పవన్ మాట్లాడుతూ.. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, ఏపీలో మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు వీరు సహకరిస్తున్నారన్నట్లుగా ఆరోపించారంటూ వైసీపీతో పాటు పలువురు వాలంటీర్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News