రాజకీయ పసికూన గా మారుతున్నారా ?

శ్రీకాకుళం జిల్లా అంటేనే కింజరాపు ఫ్యామిలీ ఆధిపత్యం అని గట్టిగా చెప్పుకుని తీరాల్సిందే.

Update: 2024-11-19 03:56 GMT

శ్రీకాకుళం జిల్లా అంటేనే కింజరాపు ఫ్యామిలీ ఆధిపత్యం అని గట్టిగా చెప్పుకుని తీరాల్సిందే. అంతలా నాలుగు దశాబ్దాలకు పైబడి ఆ కుటుంబం ప్రభావితం చేస్తోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వారిదే హవా. బలమైన సామాజిక వర్గం నేపథ్యంతో పాటు టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉండడంతో కింజరాపు ఫ్యామిలీ పాలిటిక్స్ సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్నాయి.

దీనిని బాట వేసిన వారు కింజరాపు ఎర్రన్నాయుడు. నవ యువకుడిగా ఉన్నపుడే టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా అయి ఆ మీదట తన రాజకీయ భవిష్యత్తుతో పాటు సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయాన్ని కూడా గాడిలో పెట్టిన వారు ఎర్రన్న. ఆయన దివంగతుల పన్నెండేళ్ళు గడచినా ఆయన ప్రభావం జిల్లా మీద టీడీపీ మీద చాలా ఉంది. ఇక అచ్చెన్నాయుడు కూడా దూకుడుగా రాజకీయం చేస్తూ అన్నకు తగిన తమ్ముడుగా నిలిచారు.

ఇపుడు ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు సరైన సమయానికి అందుకున్నారు. పిన్న వయసులో ఏకంగా కేంద్ర మంత్రిగా మోడీ కేబినెట్ లో చాన్స్ దక్కించుకున్నారు. ఇలా బాబాయ్ అబ్బాయ్ ఒకే టైం లో మంత్రులుగా ఉంటూ జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యేలు అంతా దాదాపుగా వారి కనుసన్ననలోనే ఉంటున్నారు.

అయితే ఆముదాలవలసకు చెందిన ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం ఎన్నికల ముందు నుంచే కొంత దూరం అయ్యారని అంటున్నారు. ఆయనను జిల్లా టీడీపీ పదవి నుంచి తప్పించి పాతపట్నానికి చెందిన కలమట వెంకట రమణమూర్తికి ఇచ్చారు. అలా ఆయనను దగ్గరకు తీసుకుంటూనే పాతపట్నంలో మామిడి గోవిందరావుకు టికెట్ ఇప్పించుకున్నారు

శ్రీకాకుళంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని పక్కన పెట్టి యువకుడు అయిన సర్పంచు గోండు శంకర్ కి టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. ఇక జిల్లాలో వెలమలు తరువాత బలంగా ఉన్న కాళింగుల నుంచి అసంతృప్తి ఉందని గ్రహించి విప్ పదవిని ఇచ్చాపురానికి చెందిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ కి దక్కేలా చూశారు.

ఈ మొత్తం పరిణామాలలో ఇబ్బంది పడుతున్నది కూన రవికుమార్ అని అంటున్నారు. ఆయనకు మంత్రి వర్గంలో కచ్చితంగా చాన్స్ దక్కుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. దాంతోనే ఆయన తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారని అంటారు. తన గన్ మెన్ లను కూడా ఆయన వెనక్కి పంపించారు అని ప్రచారం సాగింది. ఇక ఆయనకు విప్ పదవి అయినా దక్కుతుందని ఆశిస్తే అది కాస్తా అశోక్ కి వెళ్ళింది. టీటీడీ పాలకమండలి మెంబర్ గా అయినా ఇస్తారు అనుకుంటే ఆ చాన్సూ లేకుండా పోయింది. దాంతో కూనలో అసంతృప్తి పెరిగిపోతోంది అని అంటున్నారు

ఆయన తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ డ్రైవర్ లేని బండిగా జీరో అవర్ మారింది అని చేసిన కామెంట్స్ అందులో నుంచే అని అంటున్నారు. దానికి ధీటుగా అచ్చెన్నాయుడు బదులివ్వడమూ అంతా చూశారు. ఇవన్నీ చూసిన వారు జిల్లా రాజకీయాల్లో కూన వర్సెస్ కింజరాపుగా వ్యవహారం సాగుతోందా అన్న చర్చలు చేస్తున్నారు. రాజకీయంగా బలమైన స్థ్తీలో ఉన్న కింజరాపు ఫ్యామిలీ ముందు పసి కూనగా ఆయన మిగిలిపోతున్నారా అన్నది కూడా అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది.

Tags:    

Similar News