బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు...టీడీపీ కొత్త ప్రతిపాదన...
ఇండియా కూటమిలో లుకలుకలు సెమీ ఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాలలో కేవలం తెలంగాణా మాత్రమే గెలవడం వంటివి ఆ పార్టీ నిశితంగా గమనించింది అని అంటున్నారు.
ఏపీలో ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తెలుగుదేశం పార్టీ రెడీ చేసి పెట్టుకుంటోంది. మిత్రుడిగా జనసేనను ఇప్పటికే కలుపుకుంది. ఈ రెండు పార్టీల ఉమ్మడి ఎన్నికల మ్యానిఫేస్టో కూడా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇక చేరాల్సింది రావాల్సింది బీజేపీయే అన్నట్లుంది పరిస్థితి.
బీజేపీకి హిందీ బెల్ట్ లో పట్టు సడలకపోవడంతో 2024 ఎన్నికల మీద ఒక అంచనాకు టీడీపీ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇండియా కూటమిలో లుకలుకలు సెమీ ఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాలలో కేవలం తెలంగాణా మాత్రమే గెలవడం వంటివి ఆ పార్టీ నిశితంగా గమనించింది అని అంటున్నారు. ఇక బీజేపీని కలుపుకునే 2024 ఎన్నికలకు వెళ్ళాలన్నది టీడీపీ నిర్ణయంగానే కనిపిస్తోంది.
అందుకోసం బీజేపీకి మిత్రుడిగా ఉన్న జనసేనాని ద్వారానే రాయబారాన్ని పంపించాలనుకుంటోందిట. ఏపీలో మొత్తం పాతిక దాకా ఎంపీ సీట్లు ఉంటే అందులో ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదిస్తోంది అని చెబుతున్నారు. అంటే కనీసంగా మూడవ వంతు ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వడం ద్వారా పొత్తుని ఖరారు చేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.
అదే విధంగా అరడజన్ దాకా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది. 2014లో బీజేపీ టీడీపీల మధ్య పొత్తు కుదిరినపుడు నాలుగు ఎంపీ సీట్లతో పాటు 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అయితే నాలుగు ఎంపీ సీట్లలో రెండు బీజేపీ గెలిచింది. అవి విశాఖ నర్సాపురంగా ఉన్నాయి. అలాగే 12 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే కేవలం నాలుగు మాత్రమే అందులో గెలిచింది. మిగిలిన ఎనిమిది వైసీపీ పరం అయ్యాయి.
అందుకే ఈసారి ఎమ్మెల్యే సీట్లు తగ్గించి ఎంపీ సీట్లు ఎక్కువగా ఇవ్వాలని టీడీపీ అనుకుంటోందిట. మోడీ మరోసారి ప్రధాని అవుతారంటే ఎంపీ ఓటింగ్ వేరేగా ఉంటుందని, దాంతో ఎమ్మెల్యే సీట్లు తామే ఎక్కువగా పోటీ చేయవచ్చు అన్నది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు.
మరి బీజేపీకి ఎనిమిది దాకా ఎంపీ సీట్లు దక్కుతాయని అంటున్నారు. అందులో విశాఖ, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, నెల్లూరు, నరసారావుపేట, బాపట్ల, కాకినాడ ఉండవచ్చు అని తెలుస్తోంది. ఈ సీట్లలో బీజేపీ గతంలో కాకినాడ, విశాఖ తిరుపతి గెలుచుకుంది. దాంతో పాటు మరికొన్ని చోట్ల గతంలో పోటీ చేసింది. దాంతో ఈ సీట్లను కేటాయించే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక పొత్తు ఉంటే బీజేపీ నరసాపురం సీటు అడవవచ్చు అని అంటున్నారు. అయితే అది జనసేనకు ఇస్తారని ప్రచారం ఉంది.
ఏది ఏమైనా బీజేపీతోనే రేపటి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ జనసేన అయితే సూత్రప్రాయంగా నిర్ణయించాయని అంటున్నారు. కేంద్రంలోని ప్రభుత్వం సహాయ సహకారాలు ఏపీకి అవసరం అయినందువల్ల బీజేపీతో పొత్తు అనివార్యం అని అంటున్నారు. మరో వైపు చూస్తే 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న దాని మీద టీడీపీ జనసేనలకు ఒక అంచనా ఉంది అని అంటున్నారు. అలాగే సీట్లు ఎన్ని జనసేనకు ఇవ్వాలన్నది టీడీపీకి ఐడియా ఉంది. బీజేపీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పొత్తుకు ఓకే చెబితే అది కూటమికి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు.
ఇక డిసెంబర్ మూడవ వారం నుంచి జనసేన టీడీపీ అగ్ర నాయకత్వం ఉమ్మడి ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. దాంతో బీజేపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ పార్టీ నేతలను కలుపుకుని పోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీకి ప్రయారిటీ ఇవ్వాలని ఈ రోజుకీ టీడీపీ జనసేన భావిస్తున్నాయి. అయితే బీజేపీ ఏపీ మీద ఇంకా దృష్టి పెట్టలేదు అని అంటున్నారు.
ఆ పార్టీ పొత్తుల మీద ఎపుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియదు అని అంటున్నారు. అంతవరకూ తమ అవకాశాలను ఆపుకోవడం అంటే టీడీపీ జనసేనలకు కూడా ఇబ్బందే అంటున్నారు. అయితే బీజేపీ డెసిషన్ కోసం కొంత కాలం వెయిట్ చేయక తప్పేట్లు లేదని అంటున్నారు. అందుకే బీజేపీకి ఇవ్వాల్సిన ఎంపీ ఎమ్మెల్యే సీట్లను అలా ఉంచి మిగిలిన చోట్ల అండర్ స్టాండింగ్ తో ముందుకు వెళ్లాలని కూడా ఈ రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయని అంటున్నారు.