దోమల బాధను అరికట్టండిలా !
వానాకాలం మొదలు కావడంతో దోమల సమస్య మొదలవుతుంది. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు ప్రధాన కారణం దోమకాటు.
వానాకాలం మొదలు కావడంతో దోమల సమస్య మొదలవుతుంది. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు ప్రధాన కారణం దోమకాటు. అందుకే వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మొదట ఇంట్లో దోమల వ్యాప్తిని అరికట్టాలి.
వేపాకులు దోమల నివారణకు ఎంతో ఉపయోగపడతాయి. ఇంట్లో వేపాకులను కాల్చడం ద్వారా వచ్చే పొగ ద్వారా దోమల బెడద తగ్గుతుంది. మార్కెట్ లో విరివిగా లభించే వేప నూనె ఒంటికి రాసుకున్నా దోమలు కరవవు.
ఇంట్లో నిమ్మగడ్డి (లెమన్ గ్రాస్) పెంచుకుంటే ఇంట్లోకి దోమలు రావు. లెమన్ గ్రాస్ కుండీల్లో పెంచుకోవచ్చు.
ఇంట్లోకి వచ్చే ద్వారాలు, బాల్కనీల్లో కుండీలు ఏర్పాటు చేసి వాటిల్లో పెంచుకోవాలి. వీటి నుండి వచ్చే వాసన దోమలను తరుముతుంది.
ఇంట్లో పూజగదిలో ఉండే కర్పూరం కూడా దోమల నివారణకు ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో నీళ్లు పోసి గదుల్లో ఒక మూలన ఉంచడం, ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగించడం కూడా దోమలు రాకుండా ఉపయోగపడుతుంది.
కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేసిన మిశ్రమాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచి రోజూ సాయంత్రం చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు. టీ ట్రీ ఆయిల్ వాసన దోమలకు అస్సలు పడదు. హోం డిప్యూజర్, కొవ్వొత్తులు, క్రీమ్, లోషన్ వంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవడంతో దోమల బెడద చాలా తగ్గుతుంది.