అందరిదృష్టి 'జూన్1' మీదే !
ఆఖరు దశ పోలింగ్ జూన్ 1వ తేదీన పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటిస్తారు.
అసలు కంటే కొసరు ముద్దు అని సామెత. ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వ తేదీ వరకు దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు ఏడు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4వ తేదీన 2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో ముగుస్తాయి. ఆఖరు దశ పోలింగ్ జూన్ 1వ తేదీన పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటిస్తారు.
370 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా బీజేపీ ఎన్నికలలో పోరాడుతున్నది. అయితే ఇది సాధించడం అంత సులువు కాదు. 2014, 2019 ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం కోసం తీవ్ర పోరాటం చేస్తున్నది. ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) గొడుగు కింద కాంగ్రెస్ పలు పార్టీలను కలుపుకుని పోటీ చేస్తున్నది.
2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 52, ఇతర పార్టీలు ఏకంగా 187 సీట్లు గెలుచుకున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 352 స్థానాలను సాధించగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 91 స్థానాలకు పరిమితం అయింది. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను 151 స్థానాలలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితం అయింది,
ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ నాయకత్వంలో వైసీపీ ఉవ్విళ్లూరుతున్నది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 100కు పైగా స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా దానికంటే ముందు చివరిదశ పోలింగ్ ముగిసిన జూన్ 1 సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసమే ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు.