18 సార్లు ఓడినా ఎన్నికలకు మళ్లీ సై... ఎవరీ విక్రమార్కుడి కజిన్?
వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన పరమానంద్ తోలానీ వయసు 63ఏళ్లు. ఈయన వృత్తిరీత్యా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు.
పట్టినపట్టు వీడని వారిని 'విక్రమార్కుడు' అని అంటుంటారు. అంటే... అనుకున్నది సాధించే వరకూ పోరాడుతూనే ఉంటాడని అర్ధం! ఈ క్రమంలో తాజాగా విక్రమార్కుడికి కజిన్ బ్రదర్ లాంటి ఒక వ్యక్తి పట్టిన పట్టు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆయన ఎన్నికల్లో ఇప్పటికి 18సార్లు పోటీ చేసి డిపాజిట్లు పోగొట్టుకున్నా... మరోసారి ఎన్నికలకు సై అంటున్నారు!
అవును... సాధారణంగా ఎవరైనా ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు ఓడిపోతే... "మనకు రాజకీయాలు రాసిపెట్టి లేవేమో.. మనకు ఎన్నికలు అచ్చు రావేమో" అని నిరాసపడిపోతుంటారు.. ప్రత్యామ్నాయాలవైపు చూస్తుంటారు.. ఇది సహజం కూడా!! అయితే సుమారు మూడున్నర దశాబ్దాలుగా పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా.. నిరుత్సాహ పడని, విశ్వాసం సన్నగిల్లని వ్యక్తి ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన పరమానంద్ తోలానీ వయసు 63ఏళ్లు. ఈయన వృత్తిరీత్యా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. అయితే ఈయనకు ఎన్నికల్లో పోటీచేయడం అంటే విపరీతమైన ఆసక్తి! దీంతో... ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని ఈయన వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వార్తల్లో నిలిచారు. కానీ, ఒక్కసారి కూడా గెలవలేదు సరికదా.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు.
అయినా సరే ఈయన పంతం వీడటం లేదు. ఇందులో భాగంగా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల తన నామినేషన్ సమర్పించేశారు. అయితే ఇది ఈయన ఒక్కరి ఆసక్తే కాదు సుమా... ఈయన కుటుంబంలో రెండు తరాల వారు ఇలా వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ, ఓడిపోతూ ఉన్నారు! అందులో భాగంగా... పరమానంద్ తోలానీ తండ్రి కూడా ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ 30 ఏళ్ల పాటు పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయితే ఆయన మరణానంతరం.. తండ్రి వారసత్వాన్ని పరమానంద్ పునికి పుచ్చుకున్నారు. ఇందులో భాగంగా... 1989లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. నాటి నుంచి వరుసగా అసెంబ్లీ, లోక్ సభ, మేయర్.. ఇలా ఎలాంటి తారతమ్యాలూ లేకుండా దాదాపు అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతీ ఎన్నికలోనూ ఓడిపోతున్నారు. ఇలా గత 35 ఏళ్లలో ఇప్పటివరకు 18 సార్లు పోటీ చేసిన పరమానంద్.. ఒకసారి మేయర్ ఎన్నికల్లో ఆయన భార్యను కూడా నిలబెట్టారు. అయినప్పటికీ ఫలితం రాలేదు!
ఈ క్రమంలో ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నవంబరు 17న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి ఆయన బరిలోకి దిగారు. ఇందులో భాగంగా... ఇండోర్-4 స్థానం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ప్రతిసారీ డిపాజిట్ కోల్పోతున్నప్పటికీ.. ఇలా వరుసగా పోటీ చేయడం వల్ల నా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ ప్రజలు తనను ఏదో ఒకరోజు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం!