విజయవాడ ఎంపీ, టీడీపీ మాజీ నేత కేశినేని నాని ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ను టీడీపీ అధిష్టానం కేటాయించే అవకాశాలున్న నేపథ్యంలో కేశినేని నాని పార్టీని వీడారు. అప్పటినుంచి టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై నాని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై నాని సంచలన ఆరోపణలు చేశారు, 2019లో కూడా టిడిపి, జనసేనల మధ్య రహస్య పొత్తు ఉందని నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
2019 ఎన్నికల సమయంలో టీడీపీ సీనియర్ నేత ఒకరు తనకు ఫోన్ చేశారని, జనసేన తరపున తనపై పోటీగా ఏ అభ్యర్థిని నిలబెట్టాలో చెప్పాలని కోరారని కేశినేని నాని షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే, ఆ సీనియర్ నేత ఇచ్చిన ఆఫర్ ను తాను రిజెక్ట్ చేశానని అన్నారు. ఆ తర్వాత కూడా లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, విజయవాడ ఎంపీగా జనసేన తరఫున అభ్యర్థిని ఎంపిక చేయాలంటూ ఆయన తనని అడిగారని, అయితే, తాను మామూలుగానే పోటీలో నిలిచి గెలవాలనుకుంటున్నానని చెప్పినట్లు నాని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బంధువు తనకు పోటీగా నిలబడ్డారని, ఆయనకు 70,000 ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ఇక, 2019 ఎన్నికల సమయంలో కూడా టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయని, చాలామంది జనసేన అభ్యర్థులకు టిడిపినే బీఫారం ఇచ్చిందని నాని షాకింగ్ ఆరోపణలు చేశారు. మరి, కేశినేని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.