మోడీ మేలు చేస్తున్నారు...వైసీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ఇండియా టుడే కంక్లేవ్ లో మాట్లాడింది చూసినా బీజేపీ వద్దకు చంద్రబాబే వెళ్లారని కూడా అంటోంది.

Update: 2024-03-18 15:56 GMT

ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ బీజేపీ ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు అటు వైపు నుంచి కాదు ఇటు వైపు నుంచి వత్తిడి వల్లనే అన్నది ఇప్పటికే అంతా చెప్పుకుంటున్నారు. వైసీపీ అయితే అదే నిజం అని ప్రచారం చేస్తోంది. అమిత్ షా ఇండియా టుడే కంక్లేవ్ లో మాట్లాడింది చూసినా బీజేపీ వద్దకు చంద్రబాబే వెళ్లారని కూడా అంటోంది.

సరే ఆ ముచ్చట కాస్తా పక్కన పెడితే అసలు చంద్రబాబు పవన్ సభలో మోడీ జగన్ మీద ఎందుకు విమర్శలు చేయలేదు అన్నది మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని మీద వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తో పొత్తు బీజేపీ ఏదో ఆయన బలవంతం మీద కుదుర్చుకున్నా బాబు నైజం బీజేపీ పెద్దలకు బాగా తెలుసు అని అన్నారు.

చంద్రబాబు వంటి అన్యాయస్థుడు ఎవరూ దేశ రాజకీయాల్లో ఉండరని అన్నారు. ఆనాడు బీజేపీ నేతలను దారునంగా విమర్శించి ఈ రోజు మళ్లీ వారితోనే బాబు పొత్తు పెట్టుకున్నారని అందుకే బాబు గురించి తెలిసిన మోడీ ఆయన మీద ఏ ఒక్క ప్రశంస కురిపించలేకపోయారు అని అన్నారు. దానికి మోడీకి మనసు కూడా రాలేదు అని అన్నారు.

మోడీ అనాలని ఒకటి రెండు జనరల్ రిమార్క్స్ చేశారు తప్ప వైసీపీ మీద ఏమీ అనలేదని ఆయన అంటున్నారు. అయిదేళ్ల జగన్ పాలన బాగా ఉందని ప్రజలు జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు అని అన్నారు. మోడీ కూటమి సభకు వచ్చి జగన్ ని ఏమీ అనకపోవడం ద్వారా కూడా తమకు మేలు చేశారు అని రాజమోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు.

జగన్ అయిదేళ్ల పాటు మంచి పాలన అందించడమే కాకుండా కేంద్రానికి కూడా కష్టకాలంలో దేశ హితం కోసం అవసరం అయిన సందర్భాలలో కీలక బిల్లులకు మద్దతు ఇచ్చి తన నాయకత్వ పటిమని రుజువు చేసుకున్నారని అన్నారు. ఏపీ ప్రజల మనసులలో జగన్ ఉన్నారన్న సత్యం కూడా అందరికీ తెలుసు అన్నారు. ఏకంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి చేర్చిన ఘనత జగన్ ది అని అన్నారు.

ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు అని అందుకే ప్రధాని కూడా ఏమీ విమర్శించలేకపోయారు అని మేకపాటి అంటున్నారు. ఆ విధంగా కూటమి సభలో ప్రధాని మాట్లాడినా ఆయనకు కూడా అన్నీ తెలుసు అని తాను అనుకుంటున్నాను అని మేకపాటి అన్నారు. జగన్ విషయంలో తాను వైఎస్సార్ చనిపోయిన తరువాత ఏ నమ్మకంతో ఉన్నానో దాన్ని ముఖ్యమంత్రిగా పాలిస్తూ మరింతగా పెంచుకున్నారని కితాబు ఇచ్చారు.

వై నాట్ 175 అన్నది జగన్ నినాదమని తాను చేసిన మేలు గురించి ఆయన ప్రజలకు చెబుతూ ఓట్లు అడుగుతున్నారని, ఒకరిని విమర్శించి ఓట్లు పొందాలనుకోవడంలేదని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు మరీ విడ్డూరంగా ఉందని 151 సీట్లను ఒంటిచేత్తో సాధించిన జగన్ ని పట్టుకుని పాతాళానికి తొక్కేస్తాను అని అనడం కంటే దారుణం వేరే లేదని అన్నారు. ఆయన చంద్రబాబుతో ఎందుకు కలుస్తున్నారో జవాబు చెప్పాల్సి ఉందని అన్నారు. మొత్తానికి ఏపీకి మోడీ వచ్చి కూటమి సభలో ప్రసంగించిన తరువాత అది తమకు మరింతగా మేలు చేసిందని రాజమోహన్ రెడ్డి అంటున్నారు.

Tags:    

Similar News