తహసీల్దార్‌ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

కాగా ఈ హత్యకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా నిందితుడిని గుర్తించారని తెలుస్తోంది. నిందితుడు ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అని చెబుతున్నారు.

Update: 2024-02-04 06:00 GMT

విశాఖపట్నంలో తహసీల్దార్‌ రమణయ్య హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటి వద్దకు వచ్చిన దుండగుడు ఇనుప రాడ్‌ తో తలపై విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలు, రక్తస్రావంతో తహసీల్దార్‌ రమణయ్య మృతిచెందారు.

కాగా ఈ హత్యకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా నిందితుడిని గుర్తించారని తెలుస్తోంది. నిందితుడు ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అని చెబుతున్నారు. అతడు రమణయ్యను హత్య చేశాక విశాఖ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కి వెళ్లిపోయాడని చెబుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ వెల్లడించారు. మొత్తం పది బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ క్రమంలో నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నామని సీపీ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. చాలాసార్లు నిందితుడు తహసీల్దార్‌ ఆఫీసుకు వెళ్లినట్లు తేలింది. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదు అని సీపీ రవిశంకర్‌ తెలిపారు.

కాగా ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలు కారణమని భావిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చని వెల్లడించారు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహశీల్దార్‌ సెండాఫ్‌ చెప్పడానికి అపార్టుమెంట్‌ సెల్లార్‌ కు వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు అని సీపీ మీడియాకు కేసు వివరాలను వివరించారు.

విశాఖ రూరల్‌ (చినగదిలి) తహసీల్దార్‌ గా సనపల రమణయ్య రెండు రోజుల కిందటి దాకా విధులు నిర్వహించారు. ఆయన విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 2 రాత్రి 10 గంటల సమయంలో తహసీల్దార్‌ రమణయ్య ఉంటున్న కొమ్మాదిలోని చరణ్‌ క్యాస్టల్‌ అపార్టుమెంటుకు ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చీరాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు.

అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్‌ రాడ్‌ తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలారు. అది చూసి నిందితుడిని పట్టుకునేందుకు అపార్టుమెంటు వాసులు ప్రయత్నించారు. అయితే అప్పటికే నిందితుడు జారుకున్నాడు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

తహసీల్దార్‌ రమణయ్యను హత్య చేసినది మధురవాడ ప్రాంతానికి చెందిన రియల్టర్‌ ప్రసాద్‌ అని తెలుస్తోంది. అతడు వ్యాపారంలో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర నష్టపోయినట్టు సమాచారం. అతడు ఇంటిపై తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకు వారు దాన్ని వేలం ద్వారా అమ్మేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రసాద్‌ మధురవాడలోని ఒక స్థలం విషయంలో తరచూ తహసీల్దార్‌ ను కలిసేవాడని తెలుస్తోంది. తహసీల్దార్‌ రమణయ్య అతడు కోరిన పనిచేయకపోవడంతోనే హత్య చేసినట్టు తెలుస్తోంది. తహసీల్దార్‌ ను హత్య చేశాక విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి విమానంలో వెళ్లిపోయినట్టు సీసీ పుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడు వెళ్లిన విమానాశ్రయ అధికారులతోపాటు అక్కడి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.


Tags:    

Similar News