ఎన్టీఆర్, వైఎస్సార్ ఫోటోలతో టీడీపీ మాజీ నేత ప్రచారం... రేపే నామినేషన్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

Update: 2024-04-17 11:19 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా టిక్కెట్లు దొరకని అభ్యర్థులు కొంతమంది పార్టీలు మారుతుంటే.. మరికొంతమంది ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతు.. ఆయా పార్టీలకు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నారు. ఈ సమయంలో.. టిక్కెట్ దక్కకపోవడంతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వర రావు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు.

అవును... తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఈ క్రమంలో గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో... ఏలూరు జిల్లా నూజివీడులో ఇప్పుడు ముద్దరబోయిన వెంకటేశ్వర రావు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి రానున్న ఎన్నికల్లో ముద్దరబోయిన టీడీపీ టిక్కెట్ పైనే పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే... వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొలుసు పార్థసారధికి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో ముద్దరబోయిన టీడీపీకి బై బై చెప్పారు. ఈ సమయంలో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్, వైఎస్సార్ ల ఫొటోలను వినియోగించుకుంటూ.. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపైనా, టీడీపీపైనా విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... బీసీలే వెన్నెముక అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినాయకులు.. కష్టపడి పనిచేసిన అదే సామాజిక వర్గ నాయకులకు వెన్నుపోటు పొడుస్తోన్నారని ఆరోపించారు.

ఇదే సమయంలో.. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందంటూ చెప్పే మాటలన్నీ అవాస్తవాలేనని.. కోట్లు గుమ్మరించిన బడా బాబులకు టికెట్లు ఇస్తోన్నారని.. నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులను చంద్రబాబు వంచిస్తోన్నాడని ఫైర్ అయ్యారు. పది సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన తనకు టికెట్ ను నిరాకరించడమే దీనికి నిదర్శనమని అన్నారు.

ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయదలచుకున్నట్లు ముద్దరబోయిన తెలిపారు. ఈ నేపథ్యంలో తనతో పాటు తన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు తాను గానీ తన అభిమానులు గానీ భయపడబోరని స్పష్టం చేశారు.

Tags:    

Similar News