పవన్ కార్నర్‌గా ముద్రగడ వ్యాఖ్యలు.. దేనికి సంకేతం?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్నర్‌గా కాపు ఉద్యమ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్నర్‌గా కాపు ఉద్యమ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇటీవల పవన్ .. తనను కొందరు కిరాయి మూకలు బ్లేడ్‌ల తో కోస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల్లానే కలిసిపోతున్న ఈ కిరాయి మూకలు.. కార్యక్రమాలకు వచ్చి అల్లరి రేపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తన సెక్యూరిటీ సిబ్బందికి కూడా బ్లేడు బాధలు తప్పడం లేదని చెప్పారు. ఇదంతా వైసీపీ కుట్రేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
అయితే.. ఈవ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా ముద్రగడ పద్మనాభం ఈ వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం దగ్గరకు కూడా రానివ్వరని ఆయన అన్నారు. పవన్ చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారని... రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పని చేస్తారని చెప్పారు. అలాంటి పవన్ వైసీపీ నేతలను బ్లేడ్ బ్యాచ్ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని అన్నారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అంతేకాదు.. పవన్ ఇలాంటి చిల్లర వ్యాఖ్యలుచేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ``ఎన్నికల సమయం లో నన్ను కోస్తున్నారు. గిల్లుతున్నారు. గిచ్చుతున్నారు.అంటే ఓట్లు పడతాయా చెప్పండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తావో చెప్పి ఓట్లు అడగాలి. గత ఐదేళ్లుగా ఇక్కడకు ఎందుకు రాలేదు? అనేది కూడా చెప్పాలి. మీరు ఓడిపోయిన గాజువాడ, భీమవరంలో ఒక్కసారైనా పర్యటించారా? ఇప్పుడు పిఠాపురం పరిస్తితి కూడా అంతే.`` అని ముద్రగడ అన్నారు.
అయితే.. ముద్రగడ ఇలా రెండు రోజుల తర్వాత పవన్ వ్యాఖ్యలపై స్పందించడం వెనుక.. అధిష్టానం ఆయనను ఆదేశించిందనే వాదన వినిపిస్తోంది. అదేసమయంలో ఇప్పటి వరకు పవన్‌ను ప్రస్తావించ కుండానే పిఠాపురంలో ప్రచారం చేసిన వైసీపీ.. ఇప్పుడు అనూహ్యంగా పవన్‌పై విమర్శలు చేయడం వెనుక.. ఆయన ఇమేజ్‌ను తగ్గించే ప్రయత్నం సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.