పవన్ ను మరోసారి తగులుకున్న ముద్రగడ... తెరపైకి కీలక ప్రశ్నలు!
ఈ సమయంలో... తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో మరోసారి తగులుకున్నారు ముద్రగడ!
మైకందుకున్న ప్రతీసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనే సంగతి తెలిసిందే. పైగా కూటమిలో భాగంగా 20 ప్లస్ స్థానాలకు అంగీకరించినప్పటి నుంచి మొదలైన ఈ దాడి.. పిఠాపురంలో పోటీ అని ప్రకటించిన తర్వాత మరింత ఎక్కువైందని అంటున్నారు. ఈ సమయంలో... తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో మరోసారి తగులుకున్నారు ముద్రగడ!
అవును... ఇటీవల కాలంలో కాపు ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అక్కడ ముఖ్య అతిధిగా ముద్రగడకు ఆహ్వానం అందుతోందనే చెప్పాలి! ఈ సందర్భంగా కాపులకు నాడు చంద్రబాబు చేసిన ద్రోహం.. నేడు ఆయనతో కలిసి పవన్ కల్యాణ్ చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదంటూ ముద్రగడ ఫైరవుతున్నారు. ఈ క్రమంలో తాజా మరోసారి పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు ముద్రగడ పద్మనాభం!
ఇందులో భాగంగా... కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సీఎం జగన్ కు దూరమయ్యాను కానీ.. తాను ఏనాడూ వారిని విమర్శించలేదు.. విమర్శించేలా వారి పాలన ఎప్పుడూ లేదు అని మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం... వైసీపీ ప్రభుత్వం అందజేసిన విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించిన దాకలాలు గతంలో లేవని స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉంటున్నా.. ఎప్పుడూ చూడలేదని తెలిపారు!
అందువల్ల ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించిన ముద్రగడ.. జగన్ తప్ప ఇతరులెవ్వరూ అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు. ఇదే సమయంలో... పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఎందుకు చేయడం లేదంటూ తనను కొంతమంది ప్రశ్నిస్తున్నారని చెప్పిన ఆయన.. కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా చెప్తే.. ఐదేళ్లు ప్రక్కనే ఉండి ప్రశ్నించని వ్యక్తి పవన్ అని.. అలాంటి వ్యక్తికి తన మద్దతు ఎలా ఉంటుందని తిరిగి ప్రశ్నించారు!
ఇక తాను ఎంత బాధలో ఉన్నా ఏనాడు పవన్ కళ్యాణ్ ఓదార్పు చేయలేదని.. పైగా తనను క్లబ్బులు నడుపునే వాళ్లతో తిట్టిస్తున్నారని.. దమ్ము ధైర్యం ఉన్న మగాడు అయితే ప్రెస్ మీట్ పెట్టి తనను ప్రశ్నించాలని.. తనకు సమాధానం చెప్పగల ధైర్యం ఉందని ముద్రగడ పునరుద్ఘాటించారు. ఇక, 20 సీట్లతో పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించిన ఆయన.. 80 సీట్లు తీసుకోవాల్సిన వారు 20 సీట్లు తీసుకుంటారా? అని నిలదీశారు!
ఇక ప్రజాసేవ కోసం కాకుండా.. షూటింగ్ ల కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన... పార్టీని ప్యాక్ చేసేసి పవన్ షూటింగ్ లకు వెళ్లిపోతే బాగుంటుందని సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ వల్ల యువత పాడైపోతున్నారని దుయ్యబట్టారు. ఇదే సమయంలో.. పవన్ కల్యాణ్ సినిమాల్లో మాత్రమే నటించాలని.. రాజకీయాల్లో కాదని ముద్రగడ పద్మనాభం కీలక సూచన చేశారు!!