కొత్త ఏడాది మొదటి రోజునే ముద్రగడ బిగ్ ట్విస్ట్ !
నాలుగు దశాబ్దాల నిండు అయిన రాజకీయ జీవితం ముద్రగడ పద్మనాభానిది.
నాలుగు దశాబ్దాల నిండు అయిన రాజకీయ జీవితం ముద్రగడ పద్మనాభానిది. ఎన్టీయార్ నుంచి ఎందరో సీఎంలను చూసిన ముద్రగడ పద్మనాభం పట్టువదలని విక్రమార్కుడు అని పేరు. ఆయన పంతం పట్టుదల వేరే లెవెల్ అని కూడా చెబుతారు. ముద్రగడ పద్మనాభం రాజకీయాల కంటే తన సొంత కులం కోసం తాను ఉన్నాను అంటూ చాలా కాలం ఉద్యమాలు నడిపారు.
కాపు నేతగా ఆయన పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకా ఉన్న టైం లో ముద్రగడ చేసిన ఉద్యమాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక 2019 నుంచి ముద్రగడ కాపు ఉద్యమాన్ని వదిలేశారు, రాజకీయాన్ని కొంత పక్కన పెట్టారు.
అయితే ఆయన సరైన సమయంలో రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలో టీడీపీ జనసేన కూటమి ఒక వైపు ఉంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆ పార్టీని దించాలని విపక్షాలు ఏకం అవుతున్న నేపధ్యంలో ముద్రగడ తనదైన రాజకీయాన్ని ముందుకు తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయం కన్ ఫర్మ్ అయినట్లే అంటున్నారు.
దానికి నిదర్శనంగా ముద్రగడ ఉంటున్న కిర్లంపూడి ఇంటి వద్ద కొత్త ఏడాది మొదటి రోజునే భారీ సందడి నెలకొంది. ముద్రగడ అనుచరులు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ముద్రగడ వైసీపీలో చేరి తన కొత్త రాజకీయాన్ని చూపిస్తారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ముద్రగడ కుటుంబాన్ని ఎప్పటి నుంచో వైసీపీలో చేరాలని వైసీపీ కోరుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ఎంపీ మిధున్ రెడ్డి అనేక పర్యాయాలు ముద్రగడతో భేటీ అయి ఆయనన్ను వైసీపీ వైపుగా తీసుకుని వచ్చేలా చేశారు అంటున్నారు
ముద్రగడకు భారీ ఆఫర్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ముద్రగడ కుటుంబానికి రెండు టికెట్లు ఖాయమని అంటున్నారు. ఈసారి ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు కూడా పోటీ చేస్తారు అని అంటున్నారు.
ఈ విషయం మీద మీడియాతో మాట్లాడిన గిరిబాబు తన తండ్రి ఆదేశిస్తే తాను పోటీ తప్పకుండా చేస్తాను అని చెప్పడం విశేషం. అంటే ముద్రగడ ఫ్యామిలీలో ఒకరికి ఎంపీ మరొకరికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. ఇక కాకినాడ ఎంపీ టికెట్ తో పాటు పిఠాపురం లేదా పెద్దాపురం అసెంబ్లీ సీట్లలో ఒకటి అయినా ఇస్తారని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ముద్రగడ రాజకీయ జోరు పెంచారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపధ్యంలో పవన్ తోనే ఆయన ఢీ కొట్టారు. ఇక చంద్రబాబు రాజకీయం మీద కూడా ముద్రగడ ఎపుడూ ఒంటి కాలు మీద పోరాడుతూనే ఉంటున్నారు. అలాంటి ముద్రగడ వైసీపీలో చేరితే మాత్రం అది గోదావరి జిల్లా రాజకీయాలలో బిగ్ ట్విస్ట్ గానే చూడాలని అంటున్నారు.