గన్ షాట్ సీటు గురి పెట్టిన ముద్రగడ ఫ్యామిలీ...!?

సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయం అయినట్లే అని అంటున్నారు

Update: 2024-01-03 15:30 GMT

సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయం అయినట్లే అని అంటున్నారు. అయితే ఆయన కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారు ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం పలు రకాల ఊహాగానాల మధ్యన అలా సాగుతోంది. ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీగా పంపించాలని ఒక ప్రతిపాదన ఉందిట.

ఆయన్ని కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో వైసీపీకి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబుకు కానీ లేక గిరిబాబు సతీమణి సిరికి కానీ టికెట్ ఇస్తారని అంటున్నారు.

రెండవ జాబితాలో పిఠాపురం సీటుని కాకినాడ ఎంపీ వంగా గీతకు ఖరారు చేశారు. దాంతో గిరిబాబుకు పెద్దాపురం నుంచి టికెట్ దక్కుతుంది అని అంటున్నారు. ఆయన కాదు అంటే ఆయన సతీమణి సిరికి టికెట్ ఇవ్వడానికి చూస్తున్నారుట.

ఇదిలా ఉంటే సిరిని తుని నుంచి పోటీ చేయించాలని ముద్రగడ ఫ్యామిలీ భావిస్తోందిట. అనేక రకాలైన సర్వేలను చూసినపుడు తుని గన్ షాట్ గా వైసీపీ గెలుచుకునే సీటు అని అంటున్నారు. ఈ సీటు నుంచి ఇప్పటికి రెండు పర్యాయాలు 2014, 2019లలో వైసీపీ తరఫున మంత్రి దాడిశెట్టి రాజా గెలిచారు. 2024లో కూడా ఆయనే పోటీ చేస్తారు అని ప్రచారం ఇప్పటిదాకా సాగింది.

దాడిశెట్టి రాజా సీటుకు ఢోకా లేదని కూడా అంతా భావించారు. కానీ ముద్రగడ ఫ్యామిలీ తుని సీటు మీద మోజు పడడంతో ఆ సీటుని ఇచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే దాడిశెట్టి రాజా మాత్రం తాను తుని నుంచే మరోసారి పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తాను అని అంటున్నారుట. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని క్యాడర్ అంటోందని టాక్. మూడవసారి కూడా గెలిచి. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే మంత్రిగా ఇంకోసారి ప్రమాణం చేయాలని రాజా అనుకుంటున్నారుట.

అయితే ఉరమని ఉరుములా ముద్రగడ ఫ్యామిలీ కన్ను ఈ సీటు మీద పడడంతో మంత్రి వర్గీయులు తర్జన భర్జన పడుతున్నారుట. ఇక వైసీపీ అధినాయకత్వం ఒకసారి డెసిషన్ తీసుకుంటే మార్చే ప్రసక్తి ఉండకపోవచ్చు అని అంటున్నారు.

ముద్రగడను వైసీపీ వైపుగా నడిపించాలని హై కమాండ్ ఆలోచిస్తున్న వేళ ఆ ఫ్యామిలీ కోరుకున్న సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోందని అంటున్నారు. దాంతో దాడిశెట్టి రాజాకు ఢిల్లీ పయనం తప్పేట్లు లేదు అని అంటున్నారు. మరి దీని మీద పార్టీ పెద్దల వద్ద తన అయిష్టత మంత్రి తెలియచేశారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఫైనల్ గా జగన్ తుని సీటు విషయాన్ని ఖరారు చేస్తారు అని అంటున్నారు. సో తుని ముద్రగడ ఫ్యామిలీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News