కుల క్షేమమే తన క్షేమంగా... కాపుల్లో చెరగని "ముద్ర"గడ!

ఈ సమయంలో ముద్రగడ గురించి చాలామందికి తెలిసిన, కొంతమందికి తెలియని విషయాలను ఇప్పుడు చూద్దాం

Update: 2024-03-15 12:12 GMT

ముద్రగడ పద్మనాభం... ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేర్లలో ఒకటి. ప్రధానంగా కోస్తా జిల్లాలో మరింత మారుమ్రోగిపోయే నామధేయం అది! ఈయన జీవితం అంతా త్యాగాలమయమే అని ఆయన అభిమానులు, కాస్త అవగాహన ఉన్నవారు చెబుతుంటారు. ఈయన తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సమయంలో ఆయన వెంట నడిచేందుకు ఆయన అభిమానులు, అనుచరులు "సిద్ధం" అంటున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ముద్రగడ గురించి చాలామందికి తెలిసిన, కొంతమందికి తెలియని విషయాలను ఇప్పుడు చూద్దాం..!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో 1978, 1983, 1985, 1989 ఎన్నికల్లో ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయారు. ఇదే క్రమంలో 1999లో ఒకసారి ఎంపీగానూ గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లోనూ పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు.

ఇక 2014 అనంతరం ఉవ్వెత్తున లేచిన కాపు ఉద్యమ సమయంలో ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయించి తీవ్రంగా అవమానించారు చంద్రబాబు. దీంతో.. కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలో ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. అయితే టీడీపీతో జనసేన పొత్తులో ఉండటంతో ముద్రగడ చేరికను చంద్రబాబు అడ్డుకున్నారని చెబుతారు. దీనికి నాదేండ్ల మనోహర్ సహకరించారనేది నగ్నసత్యం అని అంటారు. ఇది బాబు మార్కు రాజకీయం అని నొక్కి చెబుతుంటారు.

ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... కాపు ఉద్యమ సారధులైన ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామజోగయ్యలను పరోక్షంగా కామెంట్ చేశారు. సలహాలు ఇవ్వడం సులువే అన్నట్లుగా ఎద్దేవా చేసేలా మాట్లాడారు! దీంతో కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ సమయంలో కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరడమే సరైన నిర్ణయం అని ముద్రగడ భావించారు.. దీంతో అదనపు బలం చేకూరినట్లయ్యింది!

ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో పద్మనాభం చేరికతో వైసీపీకి మరింత బలం పెరగనుందనే భావించాలి. వాస్తవానికి.. ఆది నుండి సీఎం వైఎస్ జగన్ కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అయితే మభ్యపెట్టి పబ్బం గడుపుకునే మాటలు మాత్రం జగన్ మాట్లాడలేదు. ఇందులో భాగంగానే... పాదయాత్ర సమయంలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

కానీ... రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా, ఇస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు. ఇదే సమయంలో "కాపు నేస్తం" అందించి ఆ సామాజికవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. ఎంతోమంది మహిళలకు ఆర్థికంగా బాసటగా నిలిచారు. అదేవిధంగా... 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను ప్రత్యేకంగా కాపు అభ్యర్ధులకు కేటాయించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిపదవుల్లోనూ పెద్ద పీట వేశారు!

వాస్తవానికి ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యలు జనసేన బాగుండాలని.. బలపడాలని.. రాజ్యాధికారం దక్కించుకోవాలని కోరుకున్నవారిలో ఒకరనే అనుకోవాలి! కానీ... పవన్ పార్టీ పెట్టింది అందుకు కాదు, చంద్రబాబు కోసం అని ఎప్పుడైతే తెలిసిందే లెక్కలు మారిపోయాయి. ఈ సమయంలోనే తమ కుట్రలను పసిగడతారనే భయంతోనే జోగయ్య, పద్మనాభం లాంటివారిని జనసేనలోకి రాకుండా చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ అడ్డుకున్నారు.

వాస్తవానికి 2014 సమయంలో ముద్రగడకు, ఆయన కుటుంబానికి, కాపులకు చంద్రబాబు జరిగించిన అవమానం ఫలితం 2019 ఫలితాల్లో ప్రత్యక్షంగా అనుభవించారు! దీంతో... మరో గత్యంతరం లేక పవన్ ను వెంటపెట్టుకున్నారు... కాపులకు తాను గతంలో చేసిన అవమానాలను మరిచిపోతారని చంద్రబాబు భ్రమిస్తున్నారు. అయితే... ఆ అవకాశం ముద్రగడ ఇవ్వలేదు.. తాజాగా వైసీపీలో జాయిన్ అయిపోయారు. దీంతో.. చంద్రబాబు & కో కు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు.

అయితే.. జగన్ అధికారంలో ఉంటేనే కాపులకు మేలు జరుగుతుందని నిన్న జోగయ్య కుమారుడు నమ్మారు.. వైసీపీలో చేరారు. ఇపుడు పద్మనాభం కూడా వైసీపీలో చేరారు. దీంతో... కాపుల ఓట్ల టీడీపీ పల్లకి మోస్తున్న జనసేన వైపు మళ్లకుండా ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ముద్రగడ చేరిక అటు కాపులకు, ఇటు వైసీపీకి మ్యూచువల్ గా బలం అని చెబుతున్నారు.

Tags:    

Similar News