పద్మనాభరెడ్డిని అవుతా...పవన్ కి అల్టిమేట్ సవాల్ !

పిఠాపురం అంత చవకగా ఉందా కేవలం ఎమ్మెల్యే కోసం హైదరాబాద్ నుంచి వచ్చేయాలా అని పవన్ ని ముద్రగడ నిలదీశారు

Update: 2024-04-30 06:37 GMT

ఈ సవాల్ కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నుంచి వచ్చింది. పవర్ స్టార్ జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని ముద్రగడ అంటున్నారు. పిఠాపురం నుంచ్ పవన్ ని ఓడించి పంపకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అని అల్టిమేట్ సవాల్ నే చేశారు పెద్దాయన.

పిఠాపురం అంత చవకగా ఉందా కేవలం ఎమ్మెల్యే కోసం హైదరాబాద్ నుంచి వచ్చేయాలా అని పవన్ ని ముద్రగడ నిలదీశారు. హైదరాబాద్ లో ఉన్న పెద్ద మనిషి పవన్ అక్కడే ఎన్నికల్లో పోటీ చేసి గెలవవచ్చు కదా. మా ఊరి మీదకు ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నించారు.

మేమంతా మీకు బానిసలుగా ఉండాలా మీకే ఊడిగం చేయాలా. మీరేంటి ఎక్కువ అని ప్రశ్నించారు. ఏ విషయం మీద సరైన రాజకీయ అవగాహన లేని పవన్ చంద్రబాబు పల్లకీ మోస్తూ తనను తిట్టడమేంటి అని ప్రశ్నించారు. అసలు పవన్ కి ఏమి తెలుసు అని రాజకీయాలు చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిది ఏ ఊరు ఏ మండలం, ఏ జిల్లా అంటూ పుట్టుపూర్వోత్తరాలనే ముద్రగడ ప్రశ్నించారు.

తనను నానా మాటలు అంటున్న పవన్ కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు నానా హింస తన కుటుంబాన్ని పెడుతూంటే ఎక్కడ ఉన్నారు అని ముద్రగడ నిలదీశారు. ఎంతసేపూ చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడడం తప్పించి పవన్ చేసే రాజకీయం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ముఖానికి రంగులేసుకుని అబద్దాలు అవగాహన లేని మాటలు మాట్లాడితే తాము వింటూ తింటూ పడి ఉండాలా అని ముద్రగడ అంటున్నారు. పిఠాపురంలో ఎలా పవన్ గెలుస్తారో చూస్తామని ఆయన బిగ్ చాలెంజ్ చేశారు. తనను చవట దద్దమ్మ అంటున్న పవన్ కాపుల కోసం ఏనాడైనా రొడ్డెక్కరా అని ముద్రగడ ప్రశ్నించారు.

మోడీతో చెప్పించి ప్రత్యేక జైలు కట్టిస్తామని చెబుతున్న పవన్ ఆ జైలుని చంద్రబాబు కోసం రిజర్వ్ చేసుకుంటే మంచిదని సెటైర్లు వేశారు. జగన్ తాను కాపు రిజర్వేషన్లు ఇవ్వను అన్నారు కాబట్టే నోర్మూసుకుని కూర్చున్నాను అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఇస్తామని చెప్పారు, ఎన్నికల మ్యానిఫేస్టోలో కూడా పెట్టారు కాబట్టే నిలదీశామని అన్నారు.

ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అని పవన్ కి గట్టిగానే ఇచ్చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల మీద నిందలు వేస్తున్నారని, గంజాయ్ బ్లేడ్ బ్యాచ్ అని జక్కంపూడి రాజాను అంటున్నారని నిజానికి ఆ బ్యాచ్ ని నాయకత్వం వహించి ఉంటారు పవన్ కాబట్టే ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉందేమో అని ఎద్దేవా చేసారు.

పిఠాపురంలో సునాయాసంగా గెలిచేయవచ్చు అని హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కి ఓటమి ఏంటో చూపిస్తామని ముద్రగడ అన్నారు. జిల్లా వాసులు అంటే ఆయనకు ఉన్న లోకువకు జవాబు సరిగ్గానే వస్తుందని అన్నారు. రాజకీయాలు పిల్లాట కాదని తెలుసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం ఇంత దూరం రావాలా పవన్ అని విమర్శించారు.

తెలంగాణా ఎన్నికల్లో పోటీకి పెట్టిన జనసేన అభ్యర్ధులు అంతా భారీ మెజారిటీతో గెలిచారు కదా అని సెటైర్లు పేల్చారు. ఎన్నికల అనంతరం జనసేన అంతర్ధానం అవడం ఖాయం అన్నారు. అసలు సినిమా నటులు ప్రజల కష్టాలను ఎపుడైనా తీర్చారా అని ఆయన ప్రశ్నించారు.

ఏపీ కష్టాల మీద ప్రత్యేక హోదా మీద పోలవరం మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కనీసం ఎపుడూ మాట్లాడని చిరంజీవి ఇపుడు కూటమికి ఓటేయమని వీడియోలు రిలీజ్ చేస్తే జనాలు పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే ముద్రగడ తన పేరుని మార్చుకుంటానని అంటున్నారు.

అది కూడా పద్మనాభ రెడ్డిగా అని చెబుతున్నారు. అది ఎపుడూ అంటే పవన్ ని పిఠాపురంలో ఓడించలేనపుడు అని కూడా ఆయన చెబుతున్నారు. మొత్తానికి చూస్తే పవన్ ని ఓడించాలని భారీ స్కెచ్ తోనే ముద్రగడ ఉన్నారని అర్ధం అవుతోంది. ఇంతకీ జూన్ 4 తరువాత ముద్రగడను పద్మనాభం అని పిలవాలా లేక పద్మనాభ రెడ్డి అని పిలవాలా. వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News