ముద్రగడ మౌనం వెనక...!?
ఆయన కొత్త ఏడాది మొదటి రోజునే చేసిన హడావుడిని చూసిన వారు ఇక ముద్రగడ పొలిటికల్ ఇన్నింగ్స్ వీర లెవెల్ లో అనుకున్నారు.
కాపు నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ మౌన ముద్ర దాల్చారు. ఆయన కొత్త ఏడాది మొదటి రోజునే చేసిన హడావుడిని చూసిన వారు ఇక ముద్రగడ పొలిటికల్ ఇన్నింగ్స్ వీర లెవెల్ లో అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన కిర్లంపూడిలోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం పెట్టి మరీ తన రాజకీయ రీ ఎంట్రీ మీద హింట్ ఇచ్చేశారు.
అలా 2024 జనవరి 1వ తేదీ అంతా ముద్రగడ పొలిటికల్ న్యూస్ తో మీడియా హీటెక్కింది. ఆ సమావేశం ఇచ్చిన సంకేతం ఏంటి అంటే చాలా తొందరలో ముద్రగడ వైసీపీలో చేరుతారు అని. దానికంటే ముందు అనేకసార్లు వైసీపీకి చెందిన కీలక నేతలు కిర్లంపూడి వెళ్లి ముద్రగడతో ముచ్చట్లు పెట్టి వచ్చారు.
దానికంటే ముందు పవన్ వారాహి యాత్ర వేళ ముద్రగడ ఆయన మీద ఘాటు విమర్శలు చేశారు లేఖలు సంధించారు. ఇక ముద్రగడకు చంద్రబాబు అంటే గిట్టదని కూడా అంతా చెబుతారు. ఈ నేపధ్యంలో ముద్రగడ రూట్ ఫ్యాన్ పార్టీ నీడలోకే అని కూడా గట్టిగా చెప్పి బల్లగుద్దారు.
అయితే ఆ ముచ్చట కూడా ఒక వారం తరువాత ఆగిపోయింది. ఇంతలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ముద్రగడ జనసేనలోకి చేరుతారు అని. ఇది అనూహ్యమైన వార్త. మీడియా సైతం గాసిప్స్ గా కూడా ఎపుడూ ప్రచారం చేయని వార్త ఇది. దాంతో ఈ న్యూస్ భూమి బద్ధలు అయ్యే రేంజిలో సాగి వీర లెవెల్ లో వైరల్ అయింది.
సంక్రాంతి పండుగ తరువాత ముద్రగడ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు అని ఒక వార్త నడచింది. జనసేన నేతలకు ముద్రగడ తన అభిప్రాయాలు చెప్పి వారి ద్వారా పవన్ కి తెలియచేశారు అని కూడా చెప్పుకున్నారు. ఇక ఫోన్ లో ముద్రగడ పవన్ మాట్లాడుకున్నారు అని కూడా చెప్పుకొచ్చారు. పండుగ తరువాత ఒక మంచి రోజు చూసుకుని ముద్రగడ ఇంటికి పవన్ వెళ్తారు అని కూడా అనుకున్నారు. అలా ప్రచారం సాగింది.
పవన్ కిర్లంపూడి రాలేదు కానీ అయోధ్యకు వెళ్లారు. ఆ తరువాత పవన్ వస్తారు అని అనుకున్నారు. అయితే జనవరి నెల గడచిపోయింది. ఈ లోగా ఫిబ్రవరి మొదటి వారం కూడా పూర్తి అవుతోంది. ఆ వూసూ లేదు ఆ న్యూసూ లేదు. ఇంతకీ ఏమైంది అన్నదే చర్చ. ఈ మధ్యలో ముద్రగడ వద్దకు వచ్చిన కొంతమంది జనసేన నేతలకు అసలు ఎన్ని సీట్లు జనసేనకు టీడీపీ ఇస్తుంది అన్నది ఆయన ప్రశ్నించారని, ఆ మీదట ఆయన డౌట్లు అలాగే ఉండగానే ఆయన జనసేన ప్రవేశం అలాగే ఆగిందని కూడా వార్తా కధనాలు వచ్చాయి.
ఇపుడు చూస్తే ముద్రగడ పద్మనాభం మౌనంగా ఉన్నారు. ఆయన తాను తన కుమారుడు తన సహచరులు ఒకరిద్దరితో 2024 ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అంటారు. ఆ మేరకు వైసీపీలో సీట్ల దగ్గర ఒక అవగాహన కుదరలేదని, దాంతో జనసేనలోకి వెళ్లాలని అనుకున్నా ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో ఎన్ని పోటీ చేస్తుందో అందులో తమకు ఎన్ని వస్తాయో ఇలా చాలా ప్రశ్నలతోనే ముద్రగడ మళ్లీ మౌనముద్ర దాల్చారు అని అంటున్నారు.
చూడబోతే ముద్రగడ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోరు అని అంటున్నారు. ఆయన వద్దకు జనసేన పెద్దలు వెళ్లి తమ వైపునకు తిప్పుకుంటారా అంటే అది కూడా సందేహాస్పదంగానే ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ముద్రగడ ఏం చేస్తారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది మరి.