జగన్ తో ముద్రగడ...గోదావరి జిల్లాల్లో బిగ్ ట్విస్ట్....!?
ముద్రగడ కుటుంబ సమేతంగా వైసీపీలో చేరుతారు అని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.
ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే గోదావరి జిల్లాలలో రాజకీయ సంచలనం నమోదు కాబోతోంది. బలమైన సామాజిక వర్గం నేత కాపునాడు పెద్ద అయిన ముద్రగడ పద్మనాభం జగన్ కి జై కొడుతున్నట్టుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ముద్రగడ కుటుంబ సమేతంగా వైసీపీలో చేరుతారు అని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.
విషయానికి వస్తే కాపునాడుకు ఊపిరిలూది గత ముప్పయ్యేళ్ళుగా మచ్చలేని నాయకుడిగా పేరు గడించిన ముద్రగడ అంటే గోదావరి జిల్లాలలో అవ్యాజమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ముద్రగడ మంత్రిగా ఎంపీగా పనిచేసినా అవినీతి అన్నది ఆయన దరిదాపుల్లోకి రాలేదు నిజాయతీగా నిప్పుగా పేరుగడించిన ముద్రగడ కాపులను బీసీలలో చేర్చాలని నినదిస్తూ అతి ఎద్ద ఉద్యమమే నడిపారు.
ఇక చంద్రబాబు కాపులను బీసీలలో చేరుస్తాను అని 2014 ఎన్నికల వేళ హామీ ఇచ్చినపుడు ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన ఆ హామీని నిలబెట్టుకోలేనపుడు ముద్రగడ భారీ ఎత్తున పోరాటం చేశారు. దాంతో ఆయనకు టీడీపీకి మధ్య రాజకీయ సమరమే సాగింది. ఇక ముద్రగడకు ఆ సమయంలో నైతిక మద్దతు వైసీపీ నుంచి లభించింది. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ముద్రగడ ఉద్యమానికి దూరంగా ఉంటూ వచ్చారు.
వైసీపీ పట్ల ఆయన సాఫ్ట్ కార్నర్ తోనే ఉంటూ వచ్చారు. ఇక గత కొంతకాలంగా ఆయనను వైసీపీలో చేర్పించేందుకు ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ముద్రగడ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఆయన తొందరలోనే వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. గోదావరి జిల్లాల వైసీపీ ఇంచార్జి ఎంపీ మిధున్ రెడ్డి ఇప్పటికి పలుమార్లు ముద్రగడతో చర్చించారు.
ఇక ఆయన తాజాగా మిధున్ రెడ్డి కలసినపుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఒక కండిషన్ ఉంది అని అంటున్నారు. అదేంటి అంతే ముద్రగడ కుమారుడు అయిన ముద్రగడ చల్లరావుకు టికెట్ తగిన రాజకీయ భవిష్యత్తు కోసం ముద్రగడ హామీ కోరారు అని అంటున్నారు . చల్లారావుని ఎంపీగా ఇస్తారా ఎమ్మెల్యేగా ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.
ఇక కాకినాడ ఎంపీ టికెట్ ని ముద్రగడ చల్లారావుకు ఇవ్వవచ్చు అని అంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీత పిఠాపురం నుంచి 2024 ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. దాంతో కాకినాడ ఎంపీ సీటుకు ముద్రగడ కుమారుడి పేరుని సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఒక వేళ అది కాదు అనుకుంటే పెద్దాపురం అసెంబ్లీ సీటు అయినా ఇస్తారు అని అంటున్నారు.
ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఇపుడు తోట నరసింహానికి జగ్గంపేట టికెట్ ఇస్తున్న నేపధ్యంలో పెద్దాపురం ఖాళీగానే ఉంటుంది. దాంతో అక్కడ ముద్రగడ కుమారుడికి అకాడిమేట్ చేయవచ్చు అని అంటున్నారు. మరి ఈ రెండింటిలో ఎక్కడ పోటీ చేయలన్నది ముద్రగడ ఫ్యామిలీ చాయిస్ అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరితే కనుక గోదావరి రాజకీయాలలో అతి పెద్ద కుదుపు వస్తుంది అని అంటున్నారు. ఏ గోదావరి జిల్లాలను అయితే కీ పాయింట్ గా చేసుకుని చంద్రబాబు జనసేనతో పొత్తు కలులుకుని మరీ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారో దానికి పై ఎత్తు వైసీపీ వేసినట్లుగా ఉంటుంది.
ఇక బలమైన కాపు సామాజికవర్గంలో అత్యంత ఆదరణ కలిగిన నేతగా ఉన్న ముద్రగడ వైసీపీలో చేరితే చాలా నియోజకవర్గాలలో వైసీపీకి మంచి ఎడ్జి ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి ముద్రగడ వైసీపీలో చేరుతారు అన్న వార్తలు అయితే రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. మరి ఈ ప్రచారం వాస్తవ రూపం ఎపుడు దాలుస్తుందో చూడాల్సి ఉంది.