మూసీ నిర్వాసితులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి 150-200 గజాలు
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును భారీ ప్రాధాన్యత ఇస్తున్న రేవంత సర్కారు.. ఆ దిశగా మరిన్ని నిర్ణయాల్ని చకచకా తీసుకుంటోంది.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును భారీ ప్రాధాన్యత ఇస్తున్న రేవంత సర్కారు.. ఆ దిశగా మరిన్ని నిర్ణయాల్ని చకచకా తీసుకుంటోంది. నిర్వాసితుల ఇళ్లను ఖాళీ చేయించే విషయంలో విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియకు కాస్తంత విశ్రాంతి ఇచ్చినప్పటికీ.. ఈసారి మరింత పక్కాగా ప్లాన్ చేసి.. దూకుడుగా మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా భూమి కోల్పోతున్న వారి కోసం 900 ఎకరాల్ని సేకరించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.
ఏది ఏమైనా మూసీ రూపురేఖలు మార్చటం ద్వారా.. తమ ప్రభుత్వం మాటలు చెప్పే సర్కారు కాదని.. చేతల ప్రభుత్వంగా నిరూపించాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగా తాము చేపట్టిన మూసీ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న విమర్శలపై సానుకూలంగా స్పందిస్తూ.. వారి డిమాండ్ల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకోవటానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న సంకేతాల్ని ఇస్తున్నారు.
మూసీ రూపురేఖలు మార్చే క్రమంలో మూసీ గర్భంలో ఉంటున్న వారితో పాటు 50 మీటర్లు బఫర్ జోన్ లోని వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి ఉంటుంది. మూసీ గర్భంలో ఉన్న 1600 మందిలో మూడు వంతుల మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి.. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లటానికి అంగీకరించటం తెలిసిందే. బఫర్ జోన్ లో ఉన్న వారు మాత్రం తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వని పక్షంలో తమ ఇళ్లను ఖాళీ చేయమని తెగేసి చెబుతున్నారు.
దీంతో బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితులకు ఇళ్ల స్థలాల్ని కూడా ఇస్తేనే బాగుంటుందన్న ఆలోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లుగాచెబుతున్నారు. దీనికి సంబంధించిన లెక్కల్ని చూస్తే 650-800 ఎకరాలు అవసరమన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికి 150-200 గజాల చొప్పున భూమిని ఇస్తే నిర్వాసితులు సానుకూలంగా స్పందిస్తారన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈ భూమి కోసం ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఓఆర్ఆర్ కు దగ్గరగా ఉన్న భూముల్లో గజం రూ.50వేల వరకు ఉండటంతో.. అక్కడ లేఔట్లు డెవలప్ చేసి.. బఫర్ జోన్ లోని వారికి ఈ భూమిని కేటాయింపులు జరిపితే.. వారంతా తమ ఆస్తుల్ని ఇవ్వటానికి సిద్ధమవుతారన్న భావనతో ఉంది. మరి..దీనిపై నిర్వాసితులు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.