ట్రంప్ కోసం లాటరీ తీస్తున్న మస్క్... రోజుకు రూ.8.4 కోట్లు!
ఇక వీరికి బ్యాక్ బోన్ గా పలు టీమ్ లు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
నవంబర్ 5వ తేదీన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.. రిపబ్లికన్స్ అభ్యర్థిగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ప్రత్యర్ధిపై విమర్శనాస్త్రాలతో, ప్రజలపై హామీల వర్షాలతో ప్రచార కార్యక్రమాలతో దూసుకెళ్లిపోతున్నారు.
ఇక వీరికి బ్యాక్ బోన్ గా పలు టీమ్ లు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కమలా హారిస్ కోసం వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్, డెమోక్రాటిక్ నేషనల్ ఫైనాన్స్ కమిటీ, ఏఏపీఐ విక్టరీ ఫండ్ మొదలైన సంస్థలు పని చేస్తుండగా... ట్రంప్ కి కూడా ఇలాంటి సంస్థలతో పాటు ఎలాన్ మస్క్ సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
అవును... డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే వరకూ ఆయన వెంటే ఉంటానంటూ స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాక్ స్వాతంత్ర్యం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్ పై సంతకాలు చేసే స్వింగ్ స్టేట్లలో రిజిస్టర్ అయిన ప్రతీ ఓటరుకు 47 డాలర్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు.
ఈ క్రమంలో ఎలాన్ మస్క్ సరికొత్త అలోచనను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... పెన్సిల్వేనియాలో రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీస్తామని.. వారిలో ఎంపికైన ఓటరుకు 1 మిలియన్ డాలర్స్ (సుమారు రూ.8.4) కోట్లు అందజేస్తామని తెలిపారు. నవంబర్ 5 వరకూ ఈ లాటరీ కొనసాగుతుందని వెల్లడించారు.
దీంతో... ట్రంప్ కోసం మస్క్ తన అసాధారణ సంపదను ఉపయోగిస్తున్నాడనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... అమెరికా ఎన్నికల చట్ట ప్రకారం ఇలా తాయిలాలు ప్రకటించడం చట్టబద్దమేనని అంటున్నారు. ఇది ట్రంప్ కు ఓటు వేసే వారిని గుర్తించేందుకు జరిగే ప్రయత్నమే తప్ప.. అభ్యర్థికి ఓటుకోసం నేరుగా డబ్బు చెల్లించడం కిందకు రాదని చెబుతున్నారు.