మైహోం భూజ సరగసీ 'డీల్' లెక్కలు బయటకు!

తాజాగా ఆయన్ను రిమాండ్ కు తరలించారు. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి అసలేం జరిగింది? అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు

Update: 2024-12-01 08:30 GMT

సంచలనంగా మారిన మై హోం భూజ సరగసీ ఇష్యూకు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఒడిశా నుంచి ఒక మహిళతో ఒప్పందం చేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకురావటం..కొద్ది రోజుల క్రితం సదరు మహిళ ఇంటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారిపడి చనిపోవటం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న రాజేశ్ బాబు (54)ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తాజాగా ఆయన్ను రిమాండ్ కు తరలించారు. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి అసలేం జరిగింది? అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. పోలీసు వర్గాల నుంచి అందుతున్న అనధికార సమాచారం ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన రాజేశ్ బాబు దంపతులకు పిల్లలు లేరు. దీంతో సరగసీ పద్దతిలో పిల్లల్ని పొందేందుకు సందీప్ అనే వ్యక్తి ద్వారా ఒడిశాకు చెందిన పాతికేళ్ల ఆశ్రితా సింగ్, ఆమె భర్తతో కలిసి రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా రూ.50 వేల మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. సరగసీ పద్దతి ఎలా ఉంటుందన్న వివరాల్ని వారికి చెప్పిన రాజేశ్ బాబు.. వారిని తీసుకొని తాను నివాసం ఉండే మైహోం భూజాకు తీసుకొచ్చారు.

బిడ్డ పుట్టే ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు భార్యభర్తలు విడివిడిగా ఉండాలని వైద్యులు చెప్పినట్లుగా చెప్పి.. తాను నివాసం ఉండే కమ్యునిటీలో ఏడో అంతస్తులో ఇంటిని కేటాయించారు. భర్తను.. వారి బిడ్డనుఆ ఇంట్లో ఉంచి.. ఆశ్రితా సింగ్ ను మాత్రం తమ ఇంట్లో ఉంచుకున్నారు. సరగసీ పద్దతిలో పిల్లల్ని కనేందుకు కోర్టు నుంచి తగిన అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. మరోవైపు తరచూ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించేవారు.

భర్త నుంచి దూరంగా ఉండటం.. మరోవైపు వైద్య పరీక్షల పేరుతో తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి రావటంతో ఆమె తీవ్రమైన భయాందోళనలకు గురైంది. భర్త దూరంగా ఉండటంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న ఆమె.. తాను చిత్రవధ అనుభవిస్తున్నానని ఈ నెల 26 రాత్రి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. కొద్ది రోజులు ఓర్చుకోవాలని భర్త సర్ది చెప్పగా.. ఆమె అందుకు సమ్మతించలేదు. ఇంట్లో నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఉద్దేశంతో కిటీకీ నుంచి చీరలు కట్టి.. దాని సాయంతో ఏడో అంతస్తులో ఉన్న భర్త వద్దకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో చీర పట్టుకొని కిందకు వెళ్లే క్రమంలో జారి పడిపోవటంతో చనిపోయింది. అంతే తప్పించి.. ఈ కేసులో మహిళపై నిందితుడు వేధింపులకు పాల్పడలేదన్న అంశం తమ విచారణలో తేలినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాజేశ్ విషయానికి వస్తే.. ఏపీకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేత తోడల్లుడుగా తేలినట్లు సమాచారం.

Tags:    

Similar News