మైనంపల్లిపై వేటు ఖాయం.. కొత్త అభ్యర్థి ఇతడే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ మొత్తం 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే

Update: 2023-08-28 09:29 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ మొత్తం 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా మరో నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మల్కాజిగిరి స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు సీటు లభించింది.

అయితే మైనంపల్లి తనకే కాకుండా తన కుమారుడికి కూడా సీటు (మెదక్‌ నుంచి) కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన కేసీఆర్‌ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన అంతు చూసేవరకు వదలబోనని.. సిద్ధిపేటలో హరీశ్‌ పతనం చూస్తానని మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సిద్ధిపేటను అభివృద్ధి చేసుకుని మల్కాజిగిరిని కీప్‌ లాగా చూస్తున్నాడని హరీశ్‌ పై మండిపడ్డారు.

మైనంపల్లి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. మరోవైపు మైనంపల్లిపై బీఆర్‌ఎస్‌ అధిష్టానం చర్యలు తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి సీటును వేరే వారికి కేటాయిస్తారని అంటున్నారు.

పరిణామాలు ఇలా ఉండగా తాజాగా మైనంపల్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక పెద్ద నేత ఫోన్‌ చేశారని.. మీడియా ముందు మాట్లాడొద్దని తనతో ఒట్టు వేయించుకున్నారని బాంబుపేల్చారు. అయితే ఆ పెద్ద నేత ఎవరో మైనంపల్లి వెల్లడించలేదు. తాజాగా మైనంపల్లి మల్కాజిగిరి, మెదక్‌ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, తన అనుచరులు, శ్రేయోభిలాషులతో భారీ సమావేశం నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో జరిగిన ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీని ఏమీ అనలేదని.. అలాగే పార్టీ కూడా తనను ఏమీ అనలేదని తెలిపారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టినా, విమర్శించినా తాను కూడా విమర్శిస్తానని హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలో మైనంపల్లి ఇప్పటికీ తగ్గకుండా మాట్లాడటంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సీరియస్‌ గా ఉన్నారని అంటున్నారు. మైనంపల్లిపై వేటు తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది. మైనంపల్లికి కేటాయించిన స్థానంలో ప్రస్తుతంగా ఎమ్మెల్సీగా ఉన్న శంభీపూర్‌ రాజు పోటీ చేస్తారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు కూడా అత్యంత సన్నిహితుడైన శంభీపూర్‌ రాజును అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మల్కాజిగిరికి మీ పేరును ఫైనల్‌ చేసినట్టు హరీశ్‌.. ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి మొదట విడత జాబితాలోనే శంభీపూర్‌ రాజు టికెట్‌ ఆశించారు. అయితే ఆయనకు సీటు దక్కలేదు. ఇప్పుడు అనుకోకుండా మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యల నేపథ్యంలో శంభీపూర్‌ రాజుకు అనుకోని అదృష్టం కలిసివచ్చిందని చర్చ జరుగుతోంది. అటు మైనంపల్లిపై వేటు.. మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థిగా శంభీపూర్‌ రాజు ప్రకటించడం ఒకేసారి ఉంటాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News