మోడీ 3.0 ప్రమాణస్వీకార వేళ వెనుక వెళ్లింది పులి కాదు పిల్లి
వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. వీడియోను చూసినంతనే తాము రాష్ట్రపతి భవన్ భద్రతా సిబ్బందితో మాట్లాడమని.. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఎలాంటి చిరుతపులి లేదని తెలిపారు.
మోడీ 3.0లో భాగంగా ఆదివారం రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ.. ఇతర మంత్రులు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదికగా మారింది. ఇదిలా ఉండగా. . మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పులి లాంటి ఆకారం ప్రమాణస్వీకారం చేస్తున్న మంత్రుల వెనుక భాగంలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అప్పటి నుంచి ఎవరికి వారు తమ ఊహా శక్తికి పదును పెడుతూ.. వీడియోలో కనిపిస్తున్నది పులిగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వీడియో క్లిప్ పెద్ద ఎత్తున వైరల్ కావటంతో రాష్ట్రపతి భవన్ వివరణ ఇచ్చింది. ప్రమాణస్వీకార సమయంలో కనిపించి పులి లాంటి ఆకారం అది పిల్లిగా ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ఉయికె ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన రిజిస్టర్ లో సంతకం చేసి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్రపతి భవన్ లోని కారిడార్ లో నాలుగు కాళ్ల జంతువు ఆకారం వెళ్లటం వీడియోలో కనిపించింది.
దీనిపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. వీడియోను చూసినంతనే తాము రాష్ట్రపతి భవన్ భద్రతా సిబ్బందితో మాట్లాడమని.. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఎలాంటి చిరుతపులి లేదని తెలిపారు. పిల్లులు..కుక్కలు మాత్రమే ఉన్నాయని వారుతమకు చెప్పినట్లుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
వీడియోలోకనిపించిన నాలుగు కాళ్ల జంతువు ఇళ్లల్లో తిరిగే పిల్లి మాత్రమేనని.. తప్పుడు వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు కోరుతున్నారు. ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన తర్వాత మంత్రులకు కేటాయించిన శాఖల కంటే కూడా పులి? పిల్లా? అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరగటం గమనార్హం.