మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్.. ముహూర్తం ఫిక్స్!
ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎంత ప్రభావం చూపించాయనేది తెలిసిన విషయమే.
ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎంత ప్రభావం చూపించాయనేది తెలిసిన విషయమే. కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో... ఇప్పటికే సామాజిక పెన్షన్ లను రూ.4,000కు పెంచుతూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుని, అమలు చేస్తోంది.
ఇదే క్రమంలో... 'ఉచిత’ ఇసుక, నూతన లిక్కర్ పాలసీ హామీలను అమలుచేసింది. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతీ మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి మొదలైన పథకాలను త్వరలో అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో దీపావళి కానుకగా గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం.
అవును... దీపావళి నుంచి రాష్ట్రంలో ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీపావలి నుంచే ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలోని కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అంఇంచే పథకానికి శ్రీకారం చుట్టనుందని అన్నారు. ఈ పథకం అమలుకు ఏడాదికి సుమారు రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో 1.40 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయని.. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికీ ఈ లబ్ది చేకూరేలా ఈ నెల 23న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలను ఖరారు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం ముందడు వెస్తోందని మనోహర్ చెప్పారు.
దీంతో... దీపావళి పర్వదినం రోజు చంద్రబాబు ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పినట్లే, పండుగ కానుక ఇచ్చినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో.. మిగిలిన సూపర్ సిక్స్ హామీలను కూడా ఈ ఏడాదిలో అమలుచేసేయాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజానికం!!