జనసేనకు 24 ప్లస్ 3 : నాగబాబు కి సౌండ్ లేదు!

టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ సీట్లలో పోటీ చే స్తూంటే జనసేనకు 24 సీట్లు మాత్రమే పొత్తులో కేటాయించింది

Update: 2024-02-24 07:39 GMT

తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్న దాని మీదనే ఇంతకాలం హాట్ డిస్కషన్ నడచింది. ఇపుడు ఆ లోటు తీరిపోయే విధంగా జాబితాను ఉమ్మడిగా రెండు పార్టీలు రిలీజ్ చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలసి రిలీజ్ చేసిన జాబితా చూస్తే కనుక జనసేనకు దక్కినవి పాతిక శాతం సీట్లే అని నిర్ధారణ అయింది. వందకు పాతిక అసెంబ్లీ సీట్లు జనసేన పొందితే పార్లమెంట్ చూస్తే అది కాస్తా 15 శాతానికి కుదించుకుపోయింది.

టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ సీట్లలో పోటీ చే స్తూంటే జనసేనకు 24 సీట్లు మాత్రమే పొత్తులో కేటాయించింది. అలాగే పాతిక ఎంపీ సీట్లలో జనసేనకు దక్కినవి మూడంటే మూడు సీట్లు. దీంతో ఏపీలో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని ఆలోచించేవారికి షాక్ గానే ఉంది. ఇదిలా ఉంటే జనసేనకు 24 సీట్లు అలాగే మూడు ఎంపీ సీట్లు కేటాయించడం పట్ల ఆ పార్టీ కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబు అయితే సంతోషంగా లేరు అని అంటున్నారు. ఆయన ఉమ్మడి ప్రెస్ మీట్ లో పాల్గొన్నప్పటికీ హావభావాలు చూస్తే కనుక కొంత ముభావంగానే కనిపించారు అని అంటున్నారు.

అంతే కాదు చంద్రబాబు పవన్ ల మధ్యలో ఫోటోకు ఆయనను పిలిచినప్పుడు కూడా పెద్దగా సంతోష పడినట్లుగా ఫోటోలలో కనిపించలేదు. అదే సమయంలో నాదెండ్ల మనోహర్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారని ఆయన బాడీ లాంగ్వేజ్ చెబుతోంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే గుంభనంగానే ఉన్నారు. టీడీపీ జనసేన ని గెలిపించాలని జగన్ ని ఓడించాలన్నదే లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.

ఒక విధంగా చూస్తే మాత్రం నాగబాబు ఎందుకో ఈ సీట్ల విదిలింపు పట్ల హ్యాపీగా లేరు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. టీడీపీ జనసేన ప్రభుత్వం అని తరచూ ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. అది జరగాలంటే పొత్తులలోనే కనిపించాలి. ముప్పాతిక శాతం సీట్లు ఒక పార్టీ తీసుకుంటూ పాతిక శాతం మరో పార్టీకి ఇస్తే అది సమాన షేర్ ఎలా అవుతుంది అపుడు పవర్ షేరింగ్ అన్న ప్రశ్న కూడా ఎందుకు వస్తుంది అన్న చర్చ సాగుతోంది.

ఏది ఏమైనా కూడా జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వలేదా అన్న చర్చ అయితే ఉంది. మరి ఈ విషయంలో టీడీపీ జనసేన మరిన్ని చర్చలు జరిపితే ఇంకొన్ని సీట్లు లభించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక నాగబాబు ముఖంలో అసంతృప్తి కనిపిస్తే బీజేపీ కోసమే సీట్లు తగ్గించుకున్నామని జనసేనాని పవన్ చెబుతున్నారు.

Tags:    

Similar News