నాగబాబుగారూ.. మీరు అధికారంలో ఉన్నారు.. ఈ కామెంట్లు ఎందుకు?
తాజాగా ఓ పార్టీ అంటూ.. వైసీపీపై నాగబాబు కామెంట్లు చేశారు. ఆ పార్టీ పేరు చెప్పకుండానే.. అల్లర్లకు రెడీ అవుతోందని చెప్పారు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. చేసిన కామెంట్లపై నెటిజన్లు ఫైరవుతున్నారు. పార్టీ పరంగా ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా.. లేనిపోని కామెంట్లతో కాలక్షేపం చేస్తున్నారనేది వారి ఆవేదన. ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. చిల్లర కామెంట్లతో పొద్దు పొడుస్తున్నారని పెదవి విరుస్తున్నారు. తాజాగా ఓ పార్టీ అంటూ.. వైసీపీపై నాగబాబు కామెంట్లు చేశారు. ఆ పార్టీ పేరు చెప్పకుండానే.. అల్లర్లకు రెడీ అవుతోందని చెప్పారు.
జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున ఓ పార్టీ పంచుతోందని..ఈ సొమ్ములతో జిల్లాల్లో రాజకీయ అల్లర్లు సృష్టించి.. కూటమి ప్రభుత్వాన్ని సజావుగా పాలన చేయకుండా చేయాలని కుట్రలు పన్నుతోందని నాగబాబు వెల్ల డించారు. దాదాపు 150 కోట్ల రూపాయల సొమ్మును ఇలా ఖర్చు చేస్తున్నారని.. తనకు పక్కా సమాచారం ఉందన్నారు. ఈ సొమ్మును అల్లర్లకు కాకుండా.. పేదలకు పంపిణీ చేసి.. ఆ పార్టీ చేసిన పాపాలు కడుక్కుంటే మంచిదని కూడా సలహా ఇచ్చారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. ``నాగబాబు గారూ.. మీరు అధికారంలో ఉన్నారు. చిల్లర్ల కామెంట్లు ఎందుకు? అంత పక్కా సమాచారం ఉంటే.. సదరు పార్టీ నేతలపై కేసులు పెట్టి బొక్కలో పెట్టొచ్చు కదా! కూటమి ప్రభుత్వం పాలన సజావుగా సాగేలా.. మంచి మంచి సలహాలు ఇవ్వొచ్చుకదా!`` అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు.. ప్రతిపక్షం కుట్రలు చేస్తుంటే.. ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితిలో ఉందని మీరు చెబుతున్నారా? అని ప్రశ్నించారు.
ఇదిలావుంటే.. జనసేనలోనూ నాగబాబు వ్యాఖ్యలపై చర్చ సాగింది. నిజానికి అలాంటి దేమీ లేదని కొంద రు నోటి మాటగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ బలం తగ్గిపోయిందని.. ఇప్పుడు వారిని వారు కాపాడుకునే పనిలో పడ్డారని.. ఇవి అనవసరపు వ్యాఖ్యలను పేరు వెల్లడించేందుకు ఇష్టపడని కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు.. నాగబాబు దగ్గర పక్కా సమాచారం ఉంటే నమ్మొచ్చు! అని చెప్పుకొచ్చారు. మొత్తానికి నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందిగా మారాయి.