నాగబాబు వర్సెస్ వర్మ.. సెకండ్ ప్లేస్ కోసమేనా?!
ప్రచారం కూడా వర్మ బాగానే చేశారు. ఎన్నికల పోలింగ్ పూర్తయింది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్ నమోదైంది
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు, టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణ వర్మకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? ఇద్దరూ కూడా.. ఒకరిపై ఒకరు గుస్సాగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ సారి ఎన్నికల్లో వర్మ పోటీ చేయాల్సి ఉంది. కానీ, పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన తీసుకుంది. దీంతో ఈ సీటును ఆశించిన వర్మ త్యాగం చేసి.. పవన్ కోసం ప్రచారంకూడా చేశారు. తొలి రోజుల్లో కొంత అరమరికలు వచ్చినా సర్దుకు పోయారు.
ప్రచారం కూడా వర్మ బాగానే చేశారు. ఎన్నికల పోలింగ్ పూర్తయింది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్ నమోదైంది. నిజానికి చెప్పాలంటే.. పోలింగ్ రోజు పవన్ పిఠాపురంలో కూడా లేరు. ఏజెంట్ల నుంచి మేనేజింగ్ వరకు వర్మే అంతా చూసుకున్నారు. ఇక, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు కూడా పిఠాపురంలో పర్యటించారు. ప్రచారం చేశారు. జబర్దస్త్ టీం పిఠాపురంలో ప్రచారం చేయడం వెనుక.. నాగబాబు ప్రధాన చక్రం తిప్పారు.
దీంతో రేపు పవన్ కనుక విజయం దక్కించుకుంటే.. (జూన్ 4న తేలుతుంది) ఈ విజయంలో ఎవరి భాగ స్వామ్యం ఉంటుంది? అనేది ఇప్పుడే వివాదంగా మారింది. వర్మ వర్గం అంతా.. ఇది తమవిజయమేనని.. తమ నాయకుడు సీటు త్యాగం చేసి.. ప్రచారం కూడా చేశారని.. పవన్‌ను గెలిపించబోయేది వర్మేనని ప్రచారం చేసుకుంటున్నారు. పిఠాపురం సోషల్ మీడియా మొత్తం వర్మ ను హీరో అనేస్తోంది. ఇదే.. నాగబాబుకు నచ్చినట్టుగా లేదు.
దీంతో నాగబాబు.. సైలెంట్‌గా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వర్మ పేరును కనీసం కూడా ఎత్తలేదు. దీంతోవర్మ అనుచరులు నాగబాబును ట్రోల్ చేస్తున్నారు. అంతా వర్మదేనని.. కొందరు కబుర్లు చెప్పి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ వివాదం సెకండ్ ప్లేస్ కోసమేనా? అనే చర్చ అయితే జరుగుతోంది. రేపు పవన్ గెలిచిన తర్వాత.. ఆయన తరఫున కార్యక్రమాలు చక్కబెట్టాల్సింది.. నాగబాబు మాత్రమేనని కొందరు చెబుతుంటే..వీరిలో జనసేన వర్గం కూడా ఉంది. కాదు, వర్మేనని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఫలితం రాకుండా.. పంతాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.