తగ్గేదేలే అంటున్న నాగార్జున.. వెనకుండి నడిపిస్తున్నదెవరు..?

ఎక్కడికక్కడ వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ ముక్తకంఠంతో తప్పుబట్టారు.

Update: 2024-10-06 10:22 GMT

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కొండా సురేఖ, సినీనటుడు నాగార్జున మధ్య నెలకొన్న వివాదం చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అటు రాజకీయపరంగానూ ప్రకంపనలు సృష్టించింది. ఇక.. సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ సినీలోకం అంతా ఏకమైంది. ఎక్కడికక్కడ వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ ముక్తకంఠంతో తప్పుబట్టారు.

ఈ విషయంలో కింగ్ నాగార్జున, ఆయన ఫ్యామిలీ కూడా అంతే సీరియస్‌గా ఉంది. నాగార్జున కూడా ఎక్కడా తగ్గడం లేదు. సురేఖపై ఇంకా ఆయన అదే ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సురేఖ క్షమాపణలు కోరినప్పటికీ.. పీసీసీ చీఫ్ అప్పీల్ చేసినప్పటికీ వాటిని లెక్క చేయడం లేదని సమాచారం. సురేఖ నాగచైతన్య-సమంతల విడాకులపై చేసిన వ్యాఖ్యలను వారి మనోభావాలను దెబ్బతీశాయి. దాంతో ఇప్పటికే నాగార్జున సురేఖ పై క్రిమినల్ కేసు పెట్టడమే కాకుండా పరువునష్టం దావా కూడా వేశారు. అయితే.. నాగార్జున ఇంత కోపం వెనుక ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చివేత కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఆయన ఈ ఇష్యూని ఇంత సీరియస్‌గా తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

ఏకపక్షంగా వ్యవహరించి తన ఎన్ కన్వెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేచిందన్న కోపం నాగార్జునలో మొదటి నుంచి ఉంది. తాను ఆక్రమించి నిర్మించలేదని చెప్పినప్పటికీ ప్రభుత్వం వినకుండా నేలమట్టం చేసిందని ఆయన వాదన. దాంతో.. ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఒక్కసారిగా ఆయన గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో దొరికిందే చాన్స్ అన్నట్లుగా నాగార్జున వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్ కన్వెన్షన్ ద్వారా జరిగిన నష్టాన్ని.. సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారట.

అందుకే.. నాగార్జున ఎవరు చెప్పిన కూడా వినడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సురేఖ పదే పదే క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని వదలకూడదనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. దానికితోడు అమల కూడా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో ఇదే విషయమై చర్చించినట్లు సమాచారం. మరోవైపు.. ఇప్పటికే కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న వాదన కూడా వినిపిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఈ గొడవకు చెక్ పెట్టేందుకు అధిష్టానం కూడా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సురేఖ వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకొని రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్య చేపట్టాలని నాగార్జున అనుకుంటున్నప్పటికీ.. దాని వెనుక ఎవరెవరు ఉన్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.

Tags:    

Similar News