కెకె సర్వే సంచలనం: హర్యానాలో ఆ పార్టీదే హవా

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి కేంద్రంలో త్రుటిలో అధికారాన్ని మిస్ చేసుకుంది.

Update: 2024-10-06 08:12 GMT

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి కేంద్రంలో త్రుటిలో అధికారాన్ని మిస్ చేసుకుంది. చావు తప్పి కన్ను లొట్ట పడ్డ చందంగా.. నామమాత్రం మెజార్టీతో మోడీ మూడోసారి అధికార పీఠాన్ని ఎక్కారు. హ్యాట్రిక్ పీఎంగా రికార్డు సాధించారు. 400 సీట్లు సాధించి తిరుగులేని మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తామని ఎన్నికలకు ముందు మోడీ, బీజేపీ నేతలు ప్రచారం చేసినప్పటికీ.. ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయారు.

ఇక.. నిన్నటితో జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కఠిన పరీక్షనే ఎదుర్కోబోతోంది. రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని అనుకున్న బీజేపీకి ఆ కలలు సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అదే చెప్పాయి.

వివిధ రకాల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. ఇక.. ఇప్పుడు కెకె సర్వే మరింత చర్చకు దారితీసింది. ఈ సర్వేలో సంచలన అంశం వెలుగు చూసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి 160 సీట్లకు పైగా విజయం సాధిస్తుందని కెకె సర్వే అంచనా వేసింది. తాజాగా.. హర్యానా పోల్‌పైనా తన అంచనాలను వెల్లడించింది.

కెకె సర్వే ప్రకారం.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీజేపీ కేవలం 11 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. హర్యానాలో ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే హర్యానాలోనూ ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పింది. పోలింగ్ అంతా కూడా వన్ సైడ్ జరిగినట్లు పేర్కొంది.

ఈ ఫలితాలతో ఇప్పుడు బీజేపీ ఒకింత సందిగ్ధంలో పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాకుంటే.. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయా అని హైకమాండ్ నేతల్లో చర్చ కొనసాగుతుండడం కనిపించింది. అంతేకాకుండా.. వచ్చే ఏడాది 2025లో మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఫలితాలే ఆ రాష్ట్రాల్లో చూపే అవకాశం లేకపోలేదని సర్వే అంచనా వేసింది.

Tags:    

Similar News