బీజేపీ చీఫ్ నడ్డా ప్లేస్ లో ఆరెస్సెస్ మనిషి ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మార్గదర్శిగా మాతృ సంస్థగా ఆరెస్సెస్ ని చెబుతారు

Update: 2024-10-06 06:29 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మార్గదర్శిగా మాతృ సంస్థగా ఆరెస్సెస్ ని చెబుతారు. ఆరెస్సెస్ కి ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ సంఘ్ పరివార్ గా పిలుస్తారు. అందులో రాజకీయ అంగంగా బీజేపీ ఉంది.

అయితే ప్రస్తుతం బీజేపీ పెద్దలకు ఆరెస్సెస్ కి మధ్య గ్యాప్ ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. దేశంలో కుల గణన చేపట్టాలని ఆరెస్సెస్ కూడా కోరుతోంది. ఈ నినాదాన్ని డిమాండ్ గా చేసి బడుగు అణగారిన వర్గాలలో మద్దతుని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంపాదిస్తున్నారు. ఆయా వర్గాలలో ఆయాచితంగా ఆయనకు అనుకూలత రావడానికి బీజేపీ పెద్దల సాచివేత ధోరణి కారణం అని కూడా ఆరెస్సెస్ భావిస్తోంది.

దీని వలన బీజేపీకి ఇబ్బందులు వస్తాయని కూడా ఊహిస్తోంది. కుల గణన డిమాండ్ వల్ల దేశంలోని అత్యధికులు కాంగ్రెస్ వైపు మళ్ళుతారని కూడా ఆరెస్సెస్ అంచనా కడుతోంది. మరో వైపు కుల గణన చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఇటీవల కేరళలో జరిగిన ఆరెస్సెస్ సమావేశంలో పెద్దలు గట్టిగానే స్పష్టత ఇచ్చారు.

ఇక ఆరెస్సెస్ బీజేపీని సంస్కరించాలని చూస్తోంది అంటున్నారు. బీజేపీ బలపడాలి అంటే పటిష్టమైన నాయకత్వం అవసరం అని భావిస్తోంది. జేపీ నడ్డా ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనను నాలుగు నెలల క్రితం కేంద్ర మంత్రి మండలిలోకి తీసుకున్నారు. అయినా ఆయననే బీజేపీ చీఫ్ గా కొనసాగిస్తున్నారు.

అయితే నడ్డా ప్లేస్ లో ఆరెస్సెస్ భావజాలం ఉన్న వారిని తెచ్చి పెట్టాలని సంఘ్ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం తమ మాట వినే మరో వ్యక్తికి ఆ చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

దాంతోనే నడ్డా స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే కార్యక్రమం అలా వాయిదా పడుతోంది అని అంటున్నారు. ఇక బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గట్టిగా పునరుత్తేజం పొందాలని వ్యక్తి పూజ మోడీ ఇమేజ్ తో ఇన్నాళ్ళూ పార్టీ నెట్టుకుని వచ్చినా సమిష్టి నాయకత్వమే బీజేపీకి ఎప్పటికీ బలం అన్నది ఆరెస్సెస్ మాటగా ఉంది.

సిద్ధాంత పునాది మీద నిర్మాణం అయిన బీజేపీలో వ్యక్తులకు ఎపుడూ ప్రాధాన్యత ఉండదు. కానీ గడచిన కొద్ది సంవత్సరాలలో మాత్రం అలా పరిస్థితి లేదు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అలా గెలిచినవీ ఉన్నాయి. గెలవనివీ ఉన్నాయి.

మోడీ ఇమేజ్ బాగున్న రోజులలో ఆయన వల్ల పార్టీకి ఓట్లు సీట్లు వచ్చి కమలం వికసించేది. అయితే అన్నింటికీ మోడీ ఉన్నారని రాష్ట్రాల నాయకత్వాలు కూడా నీరసించి పోయాయి. దాంతో మోడీ ఇమేజ్ తగ్గుతోందని సంకేతాలు వస్తున్న వేళ తిరిగి పార్టీని పటిష్టం చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆరెస్సెస్ భావిస్తోంది అని అంటున్నారు. అందుకే ఆరెస్సెస్ భావజాలంతో ఉన్న వారికి పూర్తిగా తమ మాట వినే వారికి బీజేపీ పగ్గాలు అప్పగిస్తే రేపటి రోజున మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

అదే విధంగా బీజేపీలో పూర్తి మార్పులు సంస్థాగతంగా జరగాలని కోరుకుంటోంది. మరి బీజేపీలో ఈ మార్పులు ఎపుడు జరుగుతాయి అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వివిధ రాష్ట్రాలలో ఎన్నికలలో వచ్చిన ఫలితాల తరువాత అయినా ఆరెస్సెస్ సీరియస్ గా బీజేపీ వైపు చూస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News