‘ఎన్ – కన్వెషన్’ వ్యవహారం... కీలక విజ్ఞప్తి చేసిన నాగార్జున!

Update: 2024-08-25 14:13 GMT

హైడ్రా అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని ‘ఎన్-కన్వెషన్’ కు అక్రమ కట్టడంగా చెబుతూ కూల్చివేతకు పూనుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ కూల్చివేతల చట్ట విరుద్ధంగా.. లేదా, తప్పుడు సమాచారంతో జరిగిందంటూ స్పందించిన నాగార్జున కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

అన్నట్లుగానే ‘ఎన్-కన్వెషన్’ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో ఈ కూల్చివేతలు నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై చర్చ కాస్త చల్లబడినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంపై నాగార్జున మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా కీలక విజ్ఞప్తి చేశారు.

అవును... గత రెండు రోజులుగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ‘ఎన్-కన్వెషన్’ నిర్మాణాలు కూల్చివేత అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా స్పందించిన నాగార్జున... తాను న్యాయస్థానం వెలువరించే తీర్పుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

ఈ సందర్భంగా ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టిన కింగ్ నాగార్జున... “ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు”... అని పేర్కొంటూ... ‘ఎన్-కన్వెషన్’ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అన్నారు. పట్టా భూమిలోనే కన్వెషన్ ను నిర్మించామని.. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని పునరుధ్ఘాటించారు.

ఇదే క్రమంలో... తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదంటూ ప్రత్యేక న్యాయస్థానం, ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24-02-2014న ఓ ఆర్డర్ ఎస్.ఆర్.3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.

ఈ సమయంలో.. న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటానని.. ఈ నేపథ్యంలో, అవాస్తవాలు నమ్మకండని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News