ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల కేసు
తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసుల మధ్య గొడవ జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే
తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసుల మధ్య గొడవ జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. డ్యాంలోని 13వ గేటు నుంచి ఏపీ పరిధిలోకి వస్తుందని ఆ రాష్ట్ర పోలీసులు ముళ్ల కంచె వేయడం, హడావిడిగా 2 క్యూసెక్కుల నీటిని సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి వదలడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ కంచెను అడ్డుకునేందుకు నిన్న విఫల ప్రయత్నాలు చేసిన తెలంగాణ పోలీసులు ఈరోజు మరోసారి ప్రయత్నించగా దానిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
ఇక నిన్న గొడవ సందర్భంగా అక్కడ సీసీటీవీ కెమెరాలను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారని, ఆ దాడిలో కొందరు తెలంగాణ పోలీసులకు గాయాలయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు ప్రకారం విజయపురి సౌత్ పోలీసులు....ఏపీ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీ పోలీసులతో పాటు ఏపీకి చెందిన నీటిపారుదల శాఖ అధికారులపై కూడా తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాలు ధ్వంసం, అనుమతి లేకుండా డ్యాం వద్దకు వచ్చి కుడికాలువకు నీటిని విడుదల చేయడం వంటి అంశాలపై ఫిర్యాదు చేశారు. మరోవైపు, కృష్ణా రివర్ బోర్డు అధికారులు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు సాగర్ డ్యాం 13వ గేట్ వద్దకు చేరుకుని చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగానే వందల సంఖ్యలో ఏపీ, తెలంగాణకు చెందిన పోలీసులు సాగర్ వద్ద మోహరించారు. ఇక, ఏపీ పోలీసుల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ లో ఆరోగ్య పరిస్థితి, ధ్వంసమైన సీసీ కెమెరాలను ఐఏఎస్ స్మితా సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాలలో ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.