కీలక సంస్థకు పేరు మార్చేసిన బాబు ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు కీలక సంస్థలకు పేర్లు మార్చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు కీలక సంస్థలకు పేర్లు మార్చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ సంస్థల ప్రాంగణాల్లో జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలను భారీ ఖర్చుతో ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ముఖ్యంగా విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీ. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య విద్యా కోర్సులకు ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఉండాలని దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మరణానంతరం ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పెట్టారు.
అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరును తొలగించి తన తండ్రి వైఎస్సార్ పేరును యూనివర్సిటీకి పెట్టారు. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పేరును మార్చారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. టీడీపీ నేతలే కాకుండా స్వయంగా జగన్ సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం పేరు మార్పును తప్పుబట్టారు. ఇలా చేయడం సరికాదని.. ఎప్పటి నుంచో ఆయా సంస్థలకు ఉన్న వ్యక్తుల పేర్లను పేర్చడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇక టీడీపీ అయితే తాము అధికారంలోకి రాగానే హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరును పెడతామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక తాము ముందుగా చేపట్టబోయే పని కూడా ఇదేనని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాలు, ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పేర్లను తలుచుకుంటే వైఎస్సార్ గుర్తొస్తారని.. అంతేకాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే వైఎస్సార్, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయని సీఎం హోదాలో జగన్ తన చర్యను సమర్థించుకున్నారు.
ప్రభుత్వం మారిపోగానే కొందరు టీడీపీ కార్యకర్తలు ఫలితాల వెల్లడి రోజే హెల్త్ యూనివర్సిటీ పేరులో ఉన్న వైఎస్సార్ అనే అక్షరాలను కాళ్లతో చెరిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే 2019 ఎన్నికల నాటికి ఏ సంస్థలకు అయితే పాత పేర్లు ఉన్నాయో అవే పేర్లను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఏ సంస్థలకయితే పేర్లు మార్చారో.. వాటన్నింటికీ యథావిధిగా పాతపేర్లనే పెట్టాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కూడా వైఎస్సార్ పేరును తీసేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టుగా పేరు మార్చనున్నారు.